Kathi Kantha Rao: ఇంట్రో: తెలుగుతెరపై చెరగని సంతకం చేసిన వారిలో టి.యల్.కాంతారావు స్థానం ప్రత్యేకమైనది… ‘కత్తి కాంతారావు’గా జనం మదిలో నిలిచారాయన… తెలుగు చిత్రసీమలో కాంతారావు సాగించిన పయనాన్ని మననం చేసుకుందాం..
తెలుగునాట కాంతారావు బాణీ ప్రత్యేకమైనది… ఆయన పేరు తలచుకోగానే ముందుగా జానపద చిత్రాలే గుర్తుకు వస్తాయి… సాంఘిక, పౌరాణిక, చారిత్రకాల్లోనూ కాంతారావు తనదైన అభినయంతో అలరించారు… అనేక మరపురాని పాత్రలతో మురిపించారు.
తెలుగు చిత్రసీమలో ఎందరో జానపద చిత్రాలతో అలరించారు… యన్టీఆర్, ఏయన్నార్ తమదైన బాణీ పలికించారు… తెలుగునాట జానపదాలు అనగానే చప్పున గుర్తుకు వచ్చే పేర్లు యన్టీఆర్ – కాంతారావువే కావడం విశేషం… అత్యధిక జానపదాల్లో నటించిన ఘనత యన్టీఆర్ ది కాగా, ఆయన తరువాత ఆ రికార్డ్ ను సొంతం చేసుకున్న హీరో కాంతారావు అనే చెప్పాలి… కాంతారావు నటజీవితం జానపదం ‘ప్రతిజ్ఞ’తోనే ఆరంభం కావడం విశేషం! హెచ్.ఎమ్.రెడ్డి తెరకెక్కించిన ‘ప్రతిజ్ఞ’తో కథానాయకునిగా అలరించారు కాంతారావు… తరువాత యన్టీఆర్ హీరోగా రూపొందిన అనేక జానపదాల్లోనూ కీలక పాత్రలు ధరించారు కాంతారావు… సదరు చిత్రాలు సైతం కాంతారావుకు నటునిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి.
ఒకానొక దశలో వరుసగా జానపద చిత్రాలలో హీరోగా నటిస్తూ సాగారు కాంతారావు… అప్పుడే ఆయనను జనం ‘కత్తి’ కాంతారావు అన్నారు… అప్పటి నుంచీ ఆ పేరును సార్థకం చేసుకుంటూ సాగిన కాంతారావు జానపదాలతో జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు.
Kathi Kantha Rao: జానపద చిత్రాల్లోనూ వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగారు కాంతారావు… కేవలం రాకుమారిని వరించి, వీరోచిత కార్యక్రమాలు చేసి చివరకు నాయికను పెళ్ళాడే కథలలోనే కాదు, జనం కోసం మనం అంటూ కొన్ని చిత్రాలు రూపొందాయి… అలాంటి సినిమాల్లోనూ కాంతారావు తనదైన బాణీ పలికించారు… సదరు చిత్రాలు సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి… యన్టీఆర్ తరువాత ఆ రోజుల్లో రిపీట్ రన్ ఉన్న హీరోగానూ కాంతారావు సాగారు… కాంతారావు జానపద చిత్రాలకు రిపీట్ రన్స్ లోనూ మంచి ఆదరణ లభించేది.
జానపదాలే అయినా, అందులోనూ విలక్షణమైన పాత్రల్లో అలరించారు కాంతారావు… కత్తి తిప్పుతూ కదం తొక్కడమే కాదు, కొన్ని చిత్రాల్లో కరుణ రసమూ ఒలికించి కన్నీరు పెట్టించారు… సదరు పాత్రలను గుర్తు చేసుకున్నా కాంతారావు ప్రతిభాపాటవాలు నాటి అభిమానుల మదిలో మెదలుతూనే ఉంటాయి.
కాంతారావు జానపదాల్లోని పాటలు, పద్యాలు సైతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి… జానపదాల్లోనూ భక్తి భావం తొణికిస్తూ కాంతారావు నటించిన తీరు జనాన్ని భలేగా మెప్పించింది… ఆ తరహా చిత్రాలు ఈ నాటికీ బుల్లితెరపై కనిపించి, నాటి అభిమానులకు ఆనందం పంచుతూ ఉండడం విశేషం.
ఆ రోజుల్లో యన్టీఆర్ హీరోయిన్స్ లో కృష్ణకుమారికి ఓ ప్రత్యేక స్థానం ఉండేది… అయితే జానపదాల్లో మాత్రం కాంతారావుకు కృష్ణకుమారి హిట్ పెయిర్ గా నిలిచారు… వారిద్దరూ నటించిన అనేక జానపద చిత్రాలు విజయపథంలో పయనించాయి… ఆ సినిమాలు ప్రస్తుతం బుల్లితెరపై కనిపించగానే, నాటి మధురానుభూతులను మననం చేసుకొనే అభిమానులు ఎందరో ఉన్నారు.
Kathi Kantha Rao: జానపదాలు అనగానే తెలుగువారికి జానపద బ్రహ్మ బి.విఠలాచార్య సినిమాలు చప్పున గుర్తుకు వస్తాయి… విఠలాచార్య చిత్రాల్లో మాయలు, మంత్రాలు సైతం చోటు చేసుకొని మురిపించేవి… కాంతారావుతో విఠలాచార్య తెరకెక్కించిన చిత్రాలలోనూ అలాంటి మాయలు మంత్రాలు అలరించాయి… కొన్ని సినిమాల్లో కాంతారావునే పువ్వుగానో, పక్షిగానో మార్చి అలరించారు విఠలాచార్య… ఆ సినిమాలు ఇప్పటికీ బాలలను ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం!
కాంతారావు అనగానే జానపదాలే కాదు, ఆయన అభినయవైభవంతో వెలిగిన పాత్రలూ స్ఫురిస్తాయి… ముఖ్యంగా నారద పాత్రలో కాంతారావు అలరించిన తీరు అనితరసాధ్యం అనిపిస్తుంది… అంతేనా పౌరాణికాల్లో యన్టీఆర్ తరువాత శ్రీరామ, శ్రీకృష్ణ ఫాత్రల్లోనూ ఆయన మురిపించిన వైనాన్ని ఎవరూ మరచిపోలేరు.
కాంతారావు నటజీవితంలో యన్టీఆర్ తో ఎంతో అనుబంధం ఉంది… యన్టీఆర్ ఆయనను సొంత తమ్మునిలా ఆదరించారు… అందుకే వారిద్దరూ కలసి పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో నటించి అలరించారు… ‘జయసింహ’ చిత్రంలో అన్నదమ్ములుగా నటించిన యన్టీఆర్, కాంతారావు రియల్ లైఫ్ లోనే అలాగే మసలుకున్నారు… యన్టీఆర్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ రూపొందించిన ‘సీతారామకళ్యాణం’లోనే కాంతారావుతో మొదటిసారి నారద పాత్రను ధరింప చేశారు… అది చూసి దర్శకుడు రజనీకాంత్ తన ‘దీపావళి’లోనూ కాంతారావుకు నారద పాత్రను ఇచ్చారు… ఈ రెండు సినిమాల్లో ‘దీపావళి’ ముందుగా విడుదలయింది… అయితే కాంతారావు నారదునిగా నటించిన తొలి చిత్రంగా మాత్రం ‘సీతారామకళ్యాణం’ అనే అంటారు.
ఆ తరువాత అనేక చిత్రాలలో ముఖ్యంగా యన్టీఆర్ నటించిన పౌరాణికాలలోనే కాంతారావు పలు మార్లు నారద పాత్రలో మురిపించారు… యన్టీఆర్ దర్శకత్వం వహించిన మరో పౌరాణిక చిత్రం ‘శ్రీక్రిష్ణ పాండవీయం’లోనూ కాంతారావు నారద పాత్రలో భలేగా రక్తి కట్టించారు.
Kathi Kantha Rao: ఒకే పాత్రను పలు మార్లు పోషించినా, ఏ నాడూ ప్రేక్షకులకు మొహం మొత్తకుండా నటించడం అంత సలువు కాదు… ఆ తీరున యన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రను పాతికసార్లు తెరపై ఆవిష్కరించారు… అదే మార్గంలో కాంతారావు నారద పాత్రలో పది చిత్రాలకు పైగా నటించి మురిపించారు… నారద పాత్ర పోషించిన ప్రతీసారి, తనదైన అభినయంతో అలరించారు కాంతారావు.
యన్టీఆర్ శ్రీరామునిగా నటించినా, శ్రీకృష్ణునిగా అభినయించినా సదరు పౌరాణికాల్లో నారద పాత్రలో కాంతారావు భలేగా మురిపించారు… ఎన్నిసార్లు నారద పాత్రను ధరించినా, ప్రతీసారి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు కాంతారావు… అంతకు ముందు ఆ తరువాత ఎందరు నారద పాత్రలు పోషించినా, తెలుగునాట నారదుని వేషం గురించిన చర్చ సాగగానే కాంతారావు ముందుగా గుర్తుకు వస్తారు.
శ్రీకృష్ణుడు, సత్యభామ, నారదుడు గుర్తుకు రాగానే ‘శ్రీకృష్ణతులాభారము’ కూడా గుర్తుకు రాకమానదు… శ్రీకృష్ణుని తులాభారములో సొంతం చేసుకున్న నారదుడు… ఆ తరువాత స్వామివారిని అంగడి వీధిలో అమ్మచూపే సన్నివేశాల్లో కాంతారావు అభినయించిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు?.
యన్టీఆర్ శ్రీరామునిగా నటించిన ‘లవకుశ’లో లక్ష్మణ పాత్రలో జీవించారు కాంతారావు… ‘లవకుశ’ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు… తమిళ చిత్రంలోనూ యన్టీఆర్, అంజలీదేవి శ్రీరామసీతాదేవి పాత్రల్లో నటించారు… కానీ, తెలుగులో యన్టీఆర్, అంజలీదేవి పాత్రలతో పాటు ఇతర పాత్రలూ ఆకట్టుకున్నాయి… వాటిలో కాంతారావు లక్ష్మణ పాత్ర మరపురానిది… ‘లవకుశ’లోని లక్ష్మణ పాత్రద్వారా కాంతారావు నటనకు రాష్ట్రపతి అవార్డు కూడా లభించడం విశేషం!.
Kathi Kantha Rao: శ్రీకృష్ణ, శ్రీరామ పాత్రలకు పెట్టింది పేరు యన్టీఆర్… ఆయన ఇతర పౌరాణిక పాత్రలు ధరించిన చిత్రాలలో శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలను కాంతారావు చేత నటింప చేశారు… కాంతారావు సైతం తనదైన అభినయంతో శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలలో నటించి మెప్పించారు… తరువాత ఇతర పౌరాణికాల్లోనూ శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో అలరించిన వైనాన్ని జనం మరచిపోలేరు.
యన్టీఆర్ ‘ఇంద్రజిత్’గా నటించిన చిత్రంలో శ్రీరాముని పాత్రలో ఆకట్టుకున్నారు కాంతారావు… ఆ పై మరికొన్ని సినిమాల్లోనూ కాంతారావు రామపాత్రలో మురిపించారు… ముఖ్యంగా ‘ఇంద్రజిత్’ పతాక సన్నివేశాల్లో కాంతారావు అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది…
కేవలం పౌరాణిక, జానపదాల్లోనే కాదు సాంఘికాల్లోనూ కాంతారావు తనదైన బాణీ పలికించారు… హీరోగానూ, విలన్ గానూ, కేరెక్టర్ యాక్టర్ గానూ కాంతారావు సాగారు… నిర్మాతగా మారడం వల్లే కాంతారావు నటజీవితం అనూహ్య పరిణామాలకు గురయిందని సినీజనం మాట.
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి… యన్టీఆర్ తరువాత కాంతారావు జానపద చిత్రాలు సైతం రిపీట్ రన్స్ లో అలరించాయి… యన్టీఆర్, ఏయన్నార్ తరువాత కాంతారావు, జగ్గయ్య కూడా కొన్ని సోషల్ మూవీస్ లో హీరోలుగా అలరించారు… లేదా ఆ ఇద్దరు మహానటుల సినిమాల్లో కీలక పాత్రల్లో ఈ ఇద్దరూ నటించి మెప్పించారు… యన్టీఆర్ పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనే కాదు సాంఘికాల్లోనూ కాంతారావు కీలకమైన పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
Kathi Kantha Rao: కాంతారావు హీరోగా తెరకెక్కిన సోషల్ మూవీస్ అంతగా అలరించలేదు… అంతేకాదు, సాంఘికాల్లో కాంతారావు కేవలం హీరో వేషాలే వేయకుండా విలన్ గానూ నటించి ఆకట్టుకున్నారు… కాంతారావు కథానాయకునిగా నటించిన కొన్ని సోషల్ మూవీస్ మాత్రమే జనాన్ని మురిపించాయి.
ఒకప్పుడు స్టార్ హీరోగా సాగిన కాంతారావును ఆయన సొంత చిత్రాలే ముంచేశాయి అంటారు… కాంతారావు నిర్మించి, నటించిన ‘సప్తస్వరాలు’ జానపదం పరవాలేదు అనిపించింది… కానీ, ఆయన ‘ప్రేమజీవులు’ అనే సినిమాను నిర్మించారు… ఇందులో తాను ప్రధాన పాత్ర పోషించి, కృష్ణను హీరోగా నటింప చేశారు… రాజశ్రీ నాయికగా నటించిన ‘ప్రేమజీవులు’ సత్తా చాటలేక పోయింది… నిర్మాతగా కాంతారావుకు నష్టాలు వాటిల్లేలా చేసింది… అయితే నిర్మాతగా కాంతారావు అభిరుచిని చాటిచెప్పింది ‘ప్రేమజీవులు’.
జానపద చిత్రాలకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో కాంతారావు మెల్లగా కేరెక్టర్ రోల్స్ కు టర్న్ అయ్యారు… అది శుభ పరిణామమే… అలాగే కొన్ని సాంఘిక చిత్రాల్లో విలన్ గానూ నటించి ఆకట్టుకున్నారు… యన్టీఆర్ తో కృష్ణ తీసిన ‘దేవుడు చేసిన మనుషులు’లో కాంతారావు, జగ్గయ్య విలన్స్ గా నటించారు… అందులో కాంతారావు విలన్ అయినా, పాటల్లోనూ ఆయనకు ప్రాధాన్యమిచ్చారు.
అప్పట్లో కృష్ణ, శోభన్ బాబు లాంటి యంగ్ హీరోస్ క్రైమ్ మూవీస్ తోనూ ఆకట్టుకున్నారు… అందువల్ల కాంతారావు కూడా ఆ దిశగా అడుగులు వేసి ‘గుండెలు తీసిన మొనగాడు’ అనే చిత్రాన్ని నిర్మించి, నటించారు… అందులో జ్యోతిలక్ష్మి నాయిక… రంగుల్లో తెరకెక్కిన ‘గుండెలు తీసిన మొనగాడు’ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది… కానీ, కాంతారావు ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది.
Kathi Kantha Rao: తరువాతి రోజుల్లో కాంతారావు ఎన్ని సినిమాల్లో నటించినా, సొంత చిత్రాలతో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికే సరిపోయింది… మొహమాటంతో ఎవరినీ ఏమీ అడగలేకపోయారు… వచ్చిన పాత్రల్లో నటించారు… లేదంటే ఉన్నవి అమ్మేసుకుంటూ సాగారు… దాంతో ఆస్తులు కరిగిపోయాయి… ఆ సమయంలో మరో ప్రయత్నంగా ‘స్వాతిచినుకులు’ అనే చిత్రాన్ని నిర్మించారు… ఈ చిత్రంతోనే వాణిశ్రీ మళ్ళీ కెమెరా ముందుకు రావాలని చూశారు… కానీ, నిర్మాణంలో ఆలస్యం జరిగింది… ‘అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు’ సినిమాతో వాణిశ్రీ రీ ఎంట్రీ ఇచ్చారు… ఆ సినిమా సక్సెస్ ‘స్వాతిచినుకులు’కు అచ్చివస్తుందని ఆశించారు… కానీ, ఫలించలేదు.
కాంతారావు నిర్మాతగా నష్టాల పాలయి, తరువాత సాధారణ జీవితం గడిపారు… అందరూ ఆయన పరిస్థితిని చూసి జాలిపడేవారు… కొందరు అవకాశాలు కల్పించేవారు… ఏది ఏమైనా కాంతారావు ‘కత్తి కాంతారావు’గా జనం మదిలో నిలచిపోయారు… కాంతారావు పేరు తలచుకున్నప్పుడల్లా ఆయన జానపద చిత్రాలు, అనితరసాధ్యంగా పోషించిన నారద పాత్ర గుర్తుకు వస్తూనే ఉంటాయి.
కాంతారావు నటజీవితాన్ని చూస్తే కడలి అలలు గుర్తుకు వస్తాయి… నిజానికి నిశ్శబ్దంగా ఉండే సముద్రం లాంటి వారు కాంతారావు… నేడు మన మధ్య కాంతారావు భౌతికంగా లేకపోయినా, ఆయన పాత్రలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.