Electricity Charges

Electricity Charges: యూనిట్‌కు 50 పైసల వరకు పెంపు, బిల్లుల్లో ఎంత భారం పడుతుందంటే?

Electricity Charges: తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ కొనుగోలు వ్యయాలను భర్తీ చేసుకునేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ట్రూ అప్ ఛార్జీల రూపంలో అదనపు భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేశాయి. మొత్తం రూ.7,635 కోట్ల ట్రూ అప్ ఛార్జీల వసూలుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) అధికారికంగా అనుమతినిచ్చింది. ఈ ఛార్జీల వసూలు నవంబర్ నెల నుంచే ప్రారంభం కానుంది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో కరెంట్ కొనుగోళ్లకు అదనంగా అయిన రూ.5,186 కోట్లు, 2023-24 రెవెన్యూ ట్రూ-అప్ కింద రూ.2,448 కోట్ల వసూలుకు డిస్కమ్‌లు దాఖలు చేసిన పిటిషన్లకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. అయితే మొత్తం ఆమోదించిన రూ.7,635 కోట్లలో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో డిస్కమ్‌లు తీసుకోనున్నాయి. మిగిలిన రూ.5,420.23 కోట్లను వినియోగదారుల నుంచే వసూలు చేయనున్నారు. ఇందులో దక్షిణ డిస్కమ్ (SPDCL) రూ.4,222.93 కోట్లు, ఉత్తర డిస్కమ్ (NPDCL) రూ.1,197.30 కోట్లను సేకరించాల్సి ఉంది.

ఈ ట్రూ అప్ ఛార్జీల వసూలు ప్రక్రియ సుదీర్ఘ కాలం పాటు కొనసాగనుంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో 29 నెలల పాటు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 26 నెలల పాటు ఈ భారం వినియోగదారులపై పడనుంది. నవంబర్ నెలలో యూనిట్‌కు 30 పైసలు (100 యూనిట్లకు రూ.30), డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసలు (100 యూనిట్లకు రూ.50) చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. ఈ ఛార్జీలను సాధారణ విద్యుత్ ఛార్జీలతో కలపకుండా బిల్లులో ప్రత్యేకంగా చూపించాలని, ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది, ఎంత లెక్కించారనే వివరాలు స్పష్టంగా పేర్కొనాలని డిస్కమ్‌లను ఈఆర్‌సీ ఆదేశించింది.

యూనిట్ల వారీగా పడే అదనపు భారం:

వాడిన యూనిట్లు నవంబర్ నెలలో అదనపు భారం (రూ.) డిసెంబర్ నుంచి అదనపు భారం (రూ.)
100 యూనిట్లు రూ. 30 రూ. 50
200 యూనిట్లు రూ. 60 రూ. 100
300 యూనిట్లు రూ. 90 రూ. 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *