Conductor Pravallika: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పది రోజుల క్రితం ప్రయాణికురాలితో జరిగిన చిల్లర వివాదంలో కదులుతున్న బస్సు నుంచి కిందకు తోసివేయబడి తీవ్రంగా గాయపడిన టీజీఎస్సార్టీసీ (TGSRTC) మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్లోని సాయి సంజీవని ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు ప్రాణాలు కోల్పోవడం ఆర్టీసీ వర్గాల్లో, కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
అసలేం జరిగింది?
మణుగూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సులో అక్టోబర్ 25న ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో మౌనిక అనే మహిళ తన కుమారుడితో కలిసి ప్రయాణానికి ఎక్కింది. బాలుడి టికెట్ ఛార్జీ, మిగిలిన చిల్లర విషయంలో కండక్టర్ ప్రవళికతో ఆమెకు వాగ్వాదం మొదలైంది. రూ.100 నోటు ఇచ్చిన సదరు ప్రయాణికురాలు వెంటనే మిగిలిన చిల్లర ఇవ్వాలని పట్టుబట్టింది. దిగేటప్పుడు చిల్లర ఇస్తానని కండక్టర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
బస్సు అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్దకు రాగానే వివాదం మరింత ముదిరింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన మౌనిక.. కదులుతున్న బస్సు ద్వారం వద్ద ఉన్న ప్రవళికను బలంగా బయటకు నెట్టేసింది. రోడ్డుపై పడిపోయిన ప్రవళికపై బస్సు వెనుక చక్రాలు దూసుకెళ్లడంతో ఆమె కుడి కాలు పూర్తిగా నుజ్జునుజ్జవగా, ఎడమ కాలికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఆసుపత్రిలో చికిత్స.. ఫలించని వైద్యుల ప్రయత్నాలు
క్షతగాత్రురాలైన ప్రవళికను తొలుత భద్రాచలం ఏరియా ఆసుపత్రికి, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని సాయి సంజీవని ఆసుపత్రికి తరలించారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించి, ప్రత్యేక వైద్య బృందంతో అత్యుత్తమ చికిత్స అందించాలని ఆదేశించారు.
అయితే తీవ్ర రక్తస్రావం, ఇన్ఫెక్షన్ కారణంగా 10 రోజుల పాటు పోరాడిన ప్రవళిక మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.ఘటనపై మణుగూరు డిపో మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలు మౌనికను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం: మంత్రి పొన్నం ప్రభాకర్
మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.కుటుంబానికి అండగా ఉండేందుకు ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ పరంగా లభించే అన్ని ప్రయోజనాలను యుద్ధప్రాతిపదికన కుటుంబానికి అందజేస్తామని తెలిపారు.టీజీఎస్సార్టీసీ వైస్ చైర్మన్ & ఎండీ వై. నాగిరెడ్డి ప్రవళిక మృతికి సంతాపం ప్రకటిస్తూ, సంస్థకు ఇది తీరని లోటని పేర్కొన్నారు.
మణుగూరు డిపో బంద్కు ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపు
విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ను కర్కశంగా బస్సు నుంచి తోసేసి ప్రాణాలు తీసిన ఘటనపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రవళిక కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని, నిందితురాలిపై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (JAC) ఆధ్వర్యంలో బుధవారం మణుగూరు డిపో బంద్కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా సిబ్బంది భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.
