Simhachalam: విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో మరోసారి ప్రమాదం అంచున నిలిచింది. గిరి ప్రదక్షిణ కోసం తొలిపావంచ దగ్గర ఏర్పాటు చేసిన రేకుల షెడ్ అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ నెల 9వ తేదీన గిరి ప్రదక్షిణ జరగనుంది. ఈ సందర్భంగా భక్తుల రక్షణ కోసం అధికారులు షెడ్లు ఏర్పాటు చేశారు. కానీ, ఈ షెడ్ నిర్మాణంలో నిర్లక్ష్యం చోటుచేసుకుంది. పునాది బలంగా లేకపోవడం, షెడ్ బరువు అధికంగా ఉండటంతో అది ఒక్కసారిగా కూలిపోయింది.
ఇది కూడా చదవండి: Arijit Singh World Record: సంగీత ప్రపంచంలో వరల్డ్ రికార్డ్ కొట్టిన అరిజిత్ సింగ్!
గతంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఏప్రిల్ 30న జరిగిన చందనోత్సవంలో నాసిరకం గోడ కూలిపోవడంతో ఏకంగా ఏడుగురు భక్తులు మృతిచెందగా, 15 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పుడు మరోసారి షెడ్ కూలిపోవడం భక్తుల్లో భయం కలిగిస్తోంది.
ఈ ఘటనపై అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ వెంటనే ప్రమాదకర షెడ్‌లను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆలయ ఈవో త్రినాధరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. “ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం” అని ఆయన తెలిపారు.
భక్తులు, ప్రజలు భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం తగదని సూచిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల భక్తుల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా చూసుకోవాలని కోరుతున్నారు.