YS Sharmila: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వారి కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగా తరచూ విమర్శల బాణాలు సందిస్తున్న షర్మిల.. ఈసారి ఆయన రాజకీయ వైఖరిపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. ప్రతిపక్ష నేతగా ఆయన తీరును సోమవారం ఎక్స్ వేదికగా తప్పుబట్టారు.
YS Sharmila: అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరు అత్తమీద కోపం దుత్తమీద చూపించనట్టుంది.. అని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీద అలగడానికో, మైక్ ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు.. ప్రజలు ఓటేసింది.. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది? అని తీవ్రంగా విమర్శించారు.
YS Sharmila: మీ స్వయంకృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకు దూరం చేస్తే.. ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడుతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం.. అని విమర్శించారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం అని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. దీనిని ఉపయోగించుకోకుండా ఇంట్లో కూర్చొంటే ఎలా అని నిలదీశారు.