Heatwave Alert

Heatwave Alert: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. ముంచుకొస్తున్న వడగాల్పులు.. IMD హై అలర్ట్!

Heatwave Alert: రెండు తెలుగు రాష్ట్రాలపై భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రోహిణీ కార్తె సమయం దగ్గర పడుతుండటంతో ఎండల తీవ్రత మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుంది. అడుగు బయటపెట్టాలంటేనే జనాలు గజగజ వణికిపోతున్నారు. జస్ట్ ఒక కిలోమీటరు దూరం ప్రయాణం చేసినా సరే కళ్లు బైర్లు కమ్మేంత వేడి జనాలను భయపెడుతోంది. ఇక బయట వేడి తట్టుకోలేక ఇంట్లో ఉందామన్నా భరించలేనంత ఉక్కపోత వేధిస్తోంది. ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు ఏకధాటిగా తిరుగుతున్నా ఒంటిపై చెమటలు మాత్రం అస్సలు ఆగడం లేదు.

మన తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏకంగా 48 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. మరికొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. పగటిపూట ఎండలు దంచికొడుతుండటంతో, రాత్రిపూట కూడా ఆ సెగలు అస్సలు తగ్గడం లేదు. గాలిలో తేమ శాతం పూర్తిగా పడిపోవడం వల్లే రాత్రిళ్లు కూడా చల్లదనం లేకుండా పోయింది. ఈరోజు రాష్ట్రంలోని దాదాపు 18 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వేసవి తాపం రికార్డులను బద్దలు కొడుతోంది. నిన్న ఒక్కరోజే పల్నాడు జిల్లాలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో 47 డిగ్రీల వేడి నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మండలాల్లో 44 డిగ్రీల వరకు, మరో 150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాలను హడలెత్తిస్తున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు కూడా ఎండలు ఇలాగే దంచికొడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అందువల్ల ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే, ఒకవైపు ఉమ్మడి కోస్తాంధ్ర జిల్లాల్లో మాడు పగిలే ఎండలు కొడుతుంటే.. మరోవైపు రాయలసీమ ప్రాంత ప్రజలకు వాతావరణ శాఖ ఇంకొక అలర్ట్ ఇచ్చింది. రాయలసీమ పరిధిలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, బలమైన మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రతకు తోడు పిడుగుల ముప్పు కూడా ఉండటంతో ఆయా జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *