Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అనూహ్యమైన హవా కొనసాగిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి విజయ్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో తమిళనాట రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీవీకే ప్రభంజనం చూస్తుంటే విజయ్ అధికారం చేపట్టడం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ చారిత్రాత్మక విజయం దిశగా అడుగులు పడుతుండటంతో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద సందడి నెలకొంది.
విజయ్ పార్టీ అఖండ మెజారిటీ దిశగా వెళ్తుండటంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చెన్నైలోని విజయ్ ఇంటి వద్ద భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయ్ ఇంటికి వెళ్లే రహదారులన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఇతర వాహనాలను విజయ్ ఇంటి వైపు వెళ్లకుండా దారి మళ్లించారు. కేవలం పోలీసులు మరియు అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే అటువైపు వెళ్లనిస్తున్నారు. విజయ్ విజయం ఖాయమవడంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాలు మొదలుపెట్టాయి. ఒక పక్క త్రిష వంటి సినీ ప్రముఖులు ఆయనను కలిసి అభినందనలు తెలుపుతుండగా, మరోపక్క సామాన్య జనం తమ అభిమాన నటుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నాడన్న ఆనందంలో మునిగిపోయారు.
