Saraswati River Pushkaram: 12 రోజులు భక్తిసంధ్యలతో నిండి ఉన్న సరస్వతీ నది పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఆదివారం విశేషంగా భక్తులు తరలివచ్చి కాళేశ్వరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అధికారుల వెల్లడిన ప్రకారం, ఆదివారం ఒక్కరోజే 3.5 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారు.
ఈ పుష్కర ఉత్సవాల్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన సతీమణితో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి సోమవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.
15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ – భక్తులకు తీవ్ర అసౌకర్యం
మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకూ 15 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వేలాది మంది భక్తులు గంటల తరబడి వాహనాల్లో ఇరుక్కుపోయారు. ముఖ్యంగా ప్రైవేట్ వాహనాలకు ఆలయం వరకూ అనుమతించడంతో పరిస్థితి మరింత విషమించిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చాలా మంది భక్తులు మహారాష్ట్ర వైపు ఘాట్లలోనే స్నానం చేసి, ఆలయ దర్శనం లేకుండానే వెనుదిరిగారు. ఈ పరిస్థితిపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అవుతూ, జిల్లా ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: Miss World Controversy: మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణలపై తెలంగాణ సర్కారు సీరియస్… విచారణకు కమిటీ ఏర్పాటు
వీఐపీలకు ప్రత్యేక సేవలు – సామాన్యుల పట్ల విరక్తత
కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో వీఐపీల సేవలో అధికారులు నిమగ్నమవడంతో, సామాన్య భక్తుల్ని పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు గురైంది. వీఐపీ ఘాట్లు బిజీగా ఉండగా, సామాన్య భక్తులకు కనీస సదుపాయాలే లేకపోవడం భక్తుల నిరాశకు కారణమైంది.
నేడు ముగింపు కార్యక్రమాలు – డ్రోన్ షో ఆకర్షణ
ఈ రోజు రాత్రి 7:45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాల ముగింపు కార్యక్రమం జరుగుతుంది.
సాయంత్రం 6 గంటల నుంచి వేద స్వస్తి, బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం, మంత్రుల ప్రసంగాలు నిర్వహించబడతాయి.
అంతేకాక, రాత్రి 7:46 నుంచి 7:54 వరకు ప్రత్యేక డ్రోన్ షో భక్తులను అలరించనుంది.
మంత్రి సీతక్క పర్యటన – అభివృద్ధి పై హామీ
మంత్రి సీతక్క పుష్కరాల్లో పుణ్యస్నానం చేసి, ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “భక్తుల కోసం సీఎం రేవంత్ రెడ్డి, నేను, మంత్రులు అన్ని ఏర్పాట్లు చేశాం. కాళేశ్వర క్షేత్రాన్ని తీర్థస్థలంగా అభివృద్ధి చేస్తున్నాం” అని వెల్లడించారు.