Revanth Reddy: తెలంగాణ నేలపై రైతాంగ హక్కుల కోసం జీవితాంతం గళమెత్తిన ప్రముఖ రైతు ఉద్యమ నేత కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జన సమితి (టీజీఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరాంతో పాటు పలు రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.
“వ్యవసాయంపై ఆయన వాకింగ్ ఎన్సైక్లోపీడియా”.. సీఎం రేవంత్ రెడ్డి..
సారంపల్లి మల్లారెడ్డి వ్యవసాయ రంగంపై తిరుగులేని అవగాహన ఉన్న మహోన్నత నాయకుడని, ఆయన ఒక ‘వాకింగ్ ఎన్సైక్లోపీడియా’ అని సీఎం కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం ఆయన చేసిన సూచనలు ఎంతో విలువైనవని, ఆయన చూపిన బాటలో నడవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
“రైతుల హక్కులైనా, పేదలకు ఇళ్ల స్థలాల సాధనైనా.. ప్రజా పోరాటాలు చేయడం కమ్యూనిస్టుల పని అయితే, వాటికి పాలనాపరంగా చట్టబద్ధమైన పరిష్కారం చూపడం కాంగ్రెస్ విధానం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి ఆశయాల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఓట్ల తొలగింపుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
సంస్మరణ సభ వేదికగా జాతీయ రాజకీయాలపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..
తెలంగాణలో కోటి ఓట్ల తొలగింపు కుట్ర?
మోదీ ప్రధాని అయ్యాక ఎన్నికల నిర్వహణ తీరు పూర్తిగా మారిపోయిందని, గతంలో అక్రమ కేసులతో గెలిచే బీజేపీ.. ఇప్పుడు వ్యతిరేక ఓట్లను ఏరివేసే వ్యూహాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ఏకంగా కోటి ఓట్లను తొలగించే భారీ కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వలస కార్మికుల ఓట్లపై వేటు..
గ్రామాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు వలస వచ్చిన పేదలు, కూలీలు, శ్రామికుల ఓట్లను గ్రామాల్లో సర్వేల పేరుతో అన్యాయంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. చనిపోయిన వారి ఓట్లు కాకుండా, బతికున్న అర్హులైన ఓటర్లనే తొలగిస్తున్నారని దుయ్యబట్టారు.
నా నియోజకవర్గంలోనే 80 వేల ఓట్ల తొలగింపు యత్నం..
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనే దాదాపు 80 వేల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం ఆరోపించారు. బిహార్, బెంగాల్‌లలో అమలు చేసిన దుర్మార్గమైన విధానాలను ఇక్కడా రుద్దాలని చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలవాలనేది ఈ కుట్రల ద్వారా ఇప్పుడే నిర్ణయించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రైతు నేత మల్లారెడ్డి ఆశయాల సాధనకు రైతాంగం, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణకు అందరూ ఏకతాటిపైకి రావాలని సభలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు పిలుపునిచ్చారు.
