SANKRANTHI SANDADI: సంక్రాంతి పండుగకు జనం పల్లెబాట పట్టారు. ఒకటి రెండు కాదు.. వందల నుంచి వేలు.. వాహనాలు బాటపట్టాయి. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి అంతా కిక్కిరిసిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి వాహనాల రద్దీ మరింతగా పెరిగింది. హైదరాబాద్ నగరంలో నివాసముండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వ్యయ ప్రయాసలు పడుతున్నారు.
హైవే పొడవునా వాహనాల రద్దీ
రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, కార్లు, వ్యాన్లు, బైక్‌లు ఏదిపడితే వాటిపై ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ వెళ్లే హైవే మాత్రం వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇది రేపు, ఎల్లుండి పండుగ రోజు కూడా కొనసాగే అవకాశం ఉన్నది. ఇంటిల్లిపాదీ సొంతూరు బాటపట్టడంతో ఎక్కడికక్కడ వాహనాల రద్దీ కనిపిస్తున్నది. దీంతో దారి పొడవునా వేలాది వాహనాలు రయ్‌రయ్‌మంటూ సాగుతున్నాయి.
16లో 12 టోల్‌ప్లాజాలు విజయవాడ వైపు ఓపెన్
హైదరాబాద్- విజయవాడ హైవేపై యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్‌ప్లాజా సిబ్బంది, పోలీసులు హైరానా పడాల్సి వస్తున్నది. మొత్తం 16 టోల్ బూత్‌లు ఉండగా, వాహనాల రద్దీ కారణంగా 12 టోల్ బూత్‌లను విజయవాడ వైపు తెరిచి ఉంచడం గమనార్హం.
ఒక్కరోజే 55 వేల వాహనాలు
సాధారణ రోజుల్లో 35,000 నుంచి 45,000 వాహనాలు వెళ్తాయని పంతంగి టోల్ ప్లాజా నిర్వాహకుల ద్వారా తెలిసింది. కానీ, శుక్రవారం ఒక్కరోజే 55,000 వాహనాలు విజయవాడ వైపు వెళ్లినట్టు వారు తెలిపారు. శనివారం అది రెట్టింపు కూడా దాటే అయ్యే అవకాశం ఉన్నదని వారు భావిస్తున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నిమిషానికి 300 వాహనాలు
పంతంగి టోల్ ప్లాజా నుంచి నాలుగు సెకండ్లలో ఒక వాహనం చొప్పున వెళ్తుంది. నిమిషానికి 300 వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్టు టోల్‌ప్లాజా నిర్వాహకులు తెలిపారు. హైవేపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక క్రేన్, అంబులెన్స్, టోయింగ్ వెయికిల్‌ను అందుబాటులో ఉంచినట్టు నేషనల్ హైవే అథారిటీ అధికారులు వెల్లడించారు.