AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వర్చువల్‌గా సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి లక్ష్యంగా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో మొత్తం 48 కీలక ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది.
ఇటీవల రాష్ట్రాన్ని కుదిపేసిన అర్నబ్ తుఫాన్ ప్రభావం, బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై సమావేశంలో లోతుగా చర్చించారు. క్షేత్రస్థాయిలో బాధితులకు పూర్తి అండగా నిలవాలని నిర్ణయించడంతో పాటు, ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అవసరమైన ప్రభుత్వ బ్యాంకు గ్యారంటీని పొడిగిస్తూ తీర్మానం చేశారు.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేశారు. విజయనగరంలో రూ.5,194 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక ‘గ్రీన్ స్టీల్ ప్లాంట్’కు ప్రత్యేక ప్రోత్సాహకాలను కేబినెట్ ఖరారు చేసింది. అదేవిధంగా రూ.3,700 కోట్ల పెట్టుబడితో రానున్న సిలికాన్ క్రిస్టల్, వేఫర్ తయారీ యూనిట్‌కు 91.10 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం తెలిపారు. ఎనిమిది కీలక పరిశ్రమలతో పాటు ఇతర అనుబంధ సంస్థలకు ‘ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ స్కీమ్’ కింద మూలధన రాయితీలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
విశాఖపట్నంలో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భూముల కేటాయింపు, అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ పార్క్, డిఫెన్స్ క్లస్టర్ల ఏర్పాటుపై సమగ్ర నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించేందుకు అమరావతి సచివాలయ టవర్ల నిర్మాణానికి దాదాపు రూ.1,925 కోట్ల విలువైన టెండర్లను పరిశీలించి ఆమోదించారు.
సాగునీరు, స్వచ్ఛ ఇంధన రంగాలకూ మంత్రివర్గం భారీగా నిధులు కేటాయించింది. కృష్ణా జిల్లా పరిధిలోని దాదాపు 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.698.90 కోట్లు మంజూరు చేయడంతో పాటు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను వేగవంతం చేసే ప్రతిపాదనలకు ఓకే చెప్పారు.
కర్నూలు జిల్లాలో పవన విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూనే, ‘ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024’లో పెట్టుబడులకు మరింత అనుకూలంగా ఉండేలా మార్పులు చేశారు. వీటితో పాటు మత్స్యకార బాలికలకు ప్రత్యేక పాఠశాల, హాస్టల్ వసతి, గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ, కాకినాడలో అమ్యూజ్‌మెంట్ పార్క్, అనంతపురంలో ఫోర్‌స్టార్ హోటల్ ఏర్పాటు వంటి అనేక ప్రజా సంక్షేమ, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది.
