Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల ఉద్యమాలు మళ్ళీ మళ్లీ ముదిరుతున్న వేళ, సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, “ఇది సమరానికి కాలం కాదు – సహకారానికి సమయం” అని స్పష్టం చేశారు.
పూర్తిగా ఆర్థికంగా కుదేలైపోయిన రాష్ట్రాన్ని పైసాపైసా లెక్కపెట్టుకుంటూ నడిపిస్తున్నట్టు పేర్కొన్న సీఎం, ఉద్యోగ సంఘాలు అర్ధం చేసుకోవాల్సిన సమయం ఇది అన్నారు. గతంలో జీతాలు ఆలస్యం అయినా నోరు విప్పని సంఘాలు, ఇప్పుడు జీతాలు సమయానికి వస్తున్నా సమ్మెలతో రోడ్డెక్కడాన్ని ఆయన ప్రశ్నించారు.
పెద్దలుగా మీరు బాధ్యత వహించాలి
ఉద్యోగ సంఘాల నేతలపై ఉద్దేశించి, “మీరు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. సమస్యలు ఉంటే చర్చిద్దాం, కానీ వీధుల్లోకి దిగొద్దు” అని సూచించారు. ప్రస్తుత ఆర్థిక స్థితిని బేరీజు వేసి, ప్రభుత్వంతో కలసి ముందుకు సాగాలని సూచించారు. “మీ సమరం ఎవరి మీద? తెలంగాణ ప్రజల మీదా?” అంటూ కఠిన ప్రశ్నలు వేశారు.
ఇది కూడా చదవండి: Nani vs Chinni Fight: వైసీపీ విజిల్ ఎంత ఊదినా ప్రయోజనమేంటి నాని?
దుబారా ఖర్చులకు చుక్కెదురు
రాష్ట్ర ఖర్చులపై దృష్టి సారించిన సీఎం, తాను ప్రత్యేక విమానాల వెనకే పడి తిరుగలేదని, సాధారణ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్నానని చెప్పారు. ఈ పరిస్థితుల్లోనూ జీతాలు ఒక్కటో తేదీనే ఇస్తున్నామంటే – అది బాధ్యతకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు.
తీవ్ర విమర్శలు
గత ప్రభుత్వం కాలంలో విధ్వంసం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్రాన్ని దివాలా తీయించింది వాళ్లే.. ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి ఫామ్ హౌస్ నుంచి వచ్చి వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు చేస్తున్నారు అంటూ రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సమరం చేస్తే ప్రజలే బాధపడతారు
ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల కోసం ధర్నాలు, ర్యాలీలు చేపడితే – ప్రజలే ఇబ్బందులు పడతారనీ, ప్రభుత్వ పథకాలు నిలిపి వేయాల్సి వస్తుందనీ హెచ్చరించారు. నన్ను కోసుకుని తిన్నా, రాష్ట్రానికి అందని డబ్బులు ఇవ్వలేను. ఆదాయానికి మించి చేయలేను అని ఖచ్చితంగా చెప్పారు.