టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో రికార్డు నెలకొల్పాడు. భారత టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో జడేజా ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి జడేజా మరోసారి రాణించాడు.దీంతో ఒకే ఇన్నింగ్స్‌లో జడేజా ఐదు వికెట్లు తీయడం ఇది14వ సారి.
తాజాగా తీసిన ఐదు వికెట్లతో కలిసి ఇప్పటివరకు జడేజా.. మొత్తం 314 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత బౌలర్లు ఇషాంత్ శర్మ (311), జహీర్ ఖాన్ (311)లను దాటేసి.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లల జాబితాలో ఐదో స్థానానికి దూసుకెళ్లాడు. భారత టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్ల రికార్డు మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (619) పేరిట ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో రవిచంద్రన్ అశ్విన్(533), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్(417)లు ఉన్నారు.
కాగా, న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఆల్ రౌండర్స్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ .. 235 పరుగులకు ఆలౌటైంది. కవీస్ బ్యాటర్లలో విల్ యంగ్(71), మిచెల్(82)లు అర్థ శతకాలతో రాణించారు. మిగతా బ్యాట్స్ మెన్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో సుందర్ 4 వికెట్లు, జడేజా 5 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశాడు.