Ravi Shastri: ప్రపంచ స్థాయి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న భారత ఓపెనర్ యశస్వి జైశ్వాల్.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి మరింత మెరుగైన బ్యాటర్గా తిరిగొస్తాడని మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఆసీస్లో ఎలాంటి సవాళ్లనైనా యశస్వి సమర్థంగా ఎదుర్కొంటాడని రవిశాస్త్రి తెలిపాడు. “ఆసీస్ను వీడే సమయానికి యశస్వి మరింత మెరుగైన బ్యాటర్ అవుతాడని భావిస్తున్నా. ఇప్పటికే అతను ప్రపంచ స్థాయి ఆటగాడు. ఇంగ్లాండ్పై యశస్వి ఎలా ఆడాడో చూశాం. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తాడు. పెర్త్లో బౌన్స్ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. ఆ దశను యశస్వి అధిగమిస్తే అతను కచ్చితంగా అలరిస్తాడు. అలాంటి పిచ్లంటే అతనికెంతో ఇష్టం. స్వేచ్చగా పరుగులు రాబట్టగల బ్యాటర్ అతను. సిరీస్ ఆరంభంలో విరాట్ కోహ్లి సత్తాచాటొచ్చు. అతను రాణించాలి కూడా. కోహ్లి భారీగా పరుగులు రాబట్టడం చూడాలని అనుకుంటున్నా” అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
