Raptadu Incident: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో కిరాతక దాడికి ఒడిగట్టిన ఉన్మాది హేమంత్ వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిందితుడిని పట్టుకునే క్రమంలో ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులపై రాళ్లు రువ్వి, సీఐపై కత్తితో దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడిని అనంతపురం జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆత్మకూరు అడవుల్లో ఏం జరిగింది? ఎదురుదాడి చేసిన హేమంత్!
శనివారం పాఠశాలలో రక్తపాతం సృష్టించిన అనంతరం నిందితుడు తప్పించుకు తిరుగుతున్నాడు. మొదట ధర్మవరం రైల్వే స్టేషన్లో పట్టుబడ్డాడనే ప్రచారం జరిగినప్పటికీ, నిందితుడు ఆత్మకూరు అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ప్రత్యేక పోలీసు బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి లొంగిపోవాలని హెచ్చరించాయి. అయితే, హేమంత్ లొంగిపోకుండా పోలీసులపై విచక్షణారహితంగా రాళ్లు రువ్వడంతో పాటు, తన వద్ద ఉన్న కత్తితో రాప్తాడు సీఐపైకి దాడికి దూసుకొచ్చాడు.తప్పించుకునే ఉద్దేశంతో ప్రాణాంతక దాడికి యత్నించడంతో, పోలీసులు ఆత్మరక్షణార్థం నిందితుడి కాళ్లను లక్ష్యంగా చేసుకుని 6 రౌండ్ల కాల్పులు జరిపారు.
కాళ్లలో 3 బుల్లెట్లు.. తొలగించే అవకాశం ఉందన్న వైద్యులు!
పోలీసుల కాల్పుల్లో గాయపడిన హేమంత్‌ను అత్యవసరంగా అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (GGH) తరలించారు. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం. నిందితుడి కాళ్లలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో పాటు ముఖానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. విపరీతమైన రక్తస్రావం కావడంతో ఇప్పటికే 4 యూనిట్ల రక్తాన్ని ఎక్కించారు. ప్రస్తుతం అతడికి ఆక్సిజన్ సపోర్ట్ అందిస్తున్నారు. బుల్లెట్ గాయాల తీవ్రత దృష్ట్యా ఇన్ఫెక్షన్ ప్రబలకుండా నిందితుడి కాళ్లను తొలగించే (Amputation) అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. సిటీ స్కాన్ రిపోర్టులు వచ్చిన తర్వాత తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు.
నిందితుడు వరసకు బాబాయ్.. గంజాయి వ్యసనమే కారణమా?
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడి నేపథ్యానికి సంబంధించి దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి.
-
వరుసకు బాబాయ్: దాడికి గురైన విద్యార్థిని గోపికకు నిందితుడు హేమంత్ స్వయానా వరసకు బాబాయ్ అవుతాడని తేలింది. తనను పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా బాలికను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శనివారం స్కూల్‌కి వెళ్లి గోపికపై రంపంతో దాడి చేయగా, అడ్డుకోబోయిన ఇంకో విద్యార్థిని పైన కూడా దాడి చేయడంతో ఆమెకి కూడా స్వల్ప గాయాలయ్యాయి.
-
గంజాయి బానిస: తల్లిదండ్రులు చనిపోవడంతో అక్క వద్ద పెరిగిన హేమంత్, చెడు ప్రవర్తన కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అనంతపురం మార్కెట్లో కూలీ పనులు చేస్తూ గంజాయి వ్యసనానికి బానిసైనట్లు విచారణలో తేలింది.
మరోవైపు, తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి ఐసీయూలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందిస్తుండగా, మంత్రి నారా లోకేష్ బాధితురాలికి అండగా ఉంటామని ప్రకటించారు. విద్యార్థినులపై ఇంతటి అమానుష దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబీకులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
