Plane Crash

Plane Crash: ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి

Plane Crash: అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో అత్యంత భయానక విమాన ప్రమాదం చోటుచేసుకుంది. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ప్రసిద్ధ ‘మార్-ఎ-లాగో’ (Mar-a-Lago) రిసార్ట్ నివాసానికి కేవలం 9 మైళ్ల (దాదాపు 11 కి.మీ) దూరంలో ఓ ప్రైవేట్ బిజినెస్ జెట్ జనావాసాల సమీపంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నింగి నుంచి వేగంగా నేలవైపు దూసుకొచ్చిన విమానం నేలను ఢీకొట్టిన మరుక్షణమే భారీ అగ్నిగోళంలా పేలిపోవడంతో ఆ ప్రాంతం యుద్ధ రంగాన్ని తలపించింది.

టెక్సాస్ నుంచి బహామాస్ వెళ్తుండగా ప్రమాదం!

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), అమెరికా రవాణా శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.
ప్రమాదానికి గురైన విమానం ‘లియర్‌జెట్‌ 60’ (Learjet 60 – రిజిస్ట్రేషన్ నంబర్ N722BD). ఇది టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహామాస్‌కు బయలుదేరింది. ఆదివారం మధ్యాహ్నం సుమారు 12:50 గంటల సమయంలో పామ్ బీచ్ కౌంటీలోని క్రెస్ట్‌హేవెన్ పరిసరాల్లో నియంత్రణ కోల్పోయి నిట్టనిలువుగా కిందకు దూసుకొచ్చింది.

 

బిజీగా ఉండే రహదారి పక్కనే విమానం కుప్పకూలడంతో ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేశాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్-ఎ-లాగోలోనే ఉన్నప్పటికీ.. ప్రమాదానికి సరిగ్గా గంట ముందు (ఉదయం 11:55 గంటలకు) ఆయన సమీప విమానాశ్రయం నుంచి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ప్రతికూల వాతావరణం, వర్షం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
క్షిపణిలా దూసుకొచ్చింది: ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో విమానం నిట్టనిలువుగా రాకెట్ లాగా నేలవైపు పడిపోతూ కనిపించింది. ఈ దృశ్యాలపై ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ స్పందిస్తూ.. “విమానం కూలిన తీరు చూస్తే అది ఆకాశం నుంచి దూసుకొచ్చిన క్షిపణిలా ఉంది. తీవ్రమైన పేలుడు ధాటికి విమాన శకలాలు అన్నివైపులా చెల్లాచెదురుగా పడిపోయాయి” అని పేర్కొన్నారు.

 

పేలుడు తీవ్రతకు భూగర్భ నీటి పైప్‌లైన్లు ధ్వంసమవడంతో పాటు స్థానిక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముందుజాగ్రత్త చర్యగా సమీపంలోని ట్రైలర్ పార్క్ కమ్యూనిటీ నుంచి దాదాపు 600 మంది స్థానికులను అత్యవసర సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి.
రంగంలోకి ఎన్‌టీఎస్‌బీ.. దర్యాప్తునకు ఆదేశం!
ఈ విషాద ఘటనపై అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమానంలో ఉన్న తొమ్మిది మంది మృతి చెందిన విషయాన్ని ఆయన అధికారికంగా ధ్రువీకరించారు.

 

ప్రమాదానికి దారితీసిన సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు ఎఫ్‌ఏఏ (FAA), జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB) ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించాయి. మృతుల గుర్తింపు, ప్రమాదం వెనుక గల పూర్తి సాంకేతిక కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడి కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *