Anantapur: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో కిరాతకంగా దాడి చేసిన నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) వైద్యులు కీలక ప్రకటన చేశారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడి కుడి కాలిని మోకాలి పైవరకు శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు (Amputation) ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి ధ్రువీకరించారు.
అర్ధరాత్రి సర్జరీ.. కుడి కాలు ఎందుకు తొలగించాల్సి వచ్చింది?
ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. పోలీసుల కాల్పుల్లో హేమంత్ కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో కుడి కాలికి రక్తప్రసరణ (Blood supply) పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కాలు క్రమంగా కుళ్లిపోయే స్థితికి చేరడంతో, ప్రాణాపాయం కలగకుండా ఉండేందుకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వైద్యుల బృందం అత్యవసర సర్జరీ నిర్వహించి మోకాలి పైవరకు కాలిని తొలగించారు.
ఎదురుకాల్పుల్లో ఎడమ కాలి రక్తనాళాలు కూడా తీవ్రంగా దెబ్బతినడంతో ఆ కాలికి కూడా నిపుణులైన వైద్యులు శస్త్రచికిత్స చేసి సరిదిద్దారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత నిందితుడిని ఆపరేషన్ థియేటర్ నుంచి ఏఎంసీ (AMC – అక్యూట్ మెడికల్ కేర్) వార్డుకు తరలించారు. ప్రస్తుతం హేమంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్ మల్లీశ్వరి స్పష్టం చేశారు.
ఆత్మకూరు అడవుల్లో ఏం జరిగింది?
పాఠశాలలో విద్యార్థినిపై దాడి చేసిన అనంతరం ఆత్మకూరు అటవీ ప్రాంతంలో దాక్కున్న హేమంత్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. పోలీసులను చూసిన నిందితుడు లొంగిపోకుండా రాళ్లు రువ్వుతూ, సీఐ వెంకటేశ్‌పై కత్తితో ప్రాణాంతక దాడికి యత్నించాడు.
మొదట హెచ్చరిస్తూ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ నిందితుడు వెనక్కి తగ్గకపోవడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు అతడి కాళ్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో తీవ్ర రక్తస్రావమైన నిందితుడిని వెంటనే అనంతపురం జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. రక్తనాళాలు చిట్లిపోవడంతో నాలుగు యూనిట్ల రక్తాన్ని కూడా ఎక్కించారు. మరోవైపు, రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత విద్యార్థిని బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ప్రభుత్వం ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తూ అండగా నిలిచింది.
