Crime News: రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మొత్తం ఆరుగురు దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ఘటన జరిగింది. తనపై గతంలో పోక్సో (POCSO) కేసు పెట్టారనే కక్షతో రాజ్‌కుమార్ (28) అనే యువకుడు ఈ మారణకాండకు ఒడిగట్టాడు.
నిందితుడైన రాజ్‌కుమార్‌కు ఏడేళ్ల క్రితం సరిత (33)తో ప్రేమ వివాహం అయింది. వీరికి పరీక్షిత్ (4), దైవీక్షిత్ (2) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే, వేరే ఒక 17 ఏళ్ల మైనర్ బాలికను వేధించాడనే కారణంతో ఆమె తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజ్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. అప్పట్లో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, ఇటీవలె బెయిల్‌పై జైలు నుండి బయటకు వచ్చాడు. తన జీవితం నాశనం కావడానికి కారణమైన వారిపై పగ పెంచుకున్న రాజ్‌కుమార్ శనివారం తెల్లవారుజామున కత్తితో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
మొదట దైవాలగూడలోని తన సొంత ఇంట్లోనే నిద్రిస్తున్న భార్య సరితతో పాటు ఇద్దరు అమాయక కొడుకులు పరీక్షిత్, దైవీక్షిత్‌ల పీకలు కోసి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత షాబాద్ పీఆర్ ఆర్ స్టేడియం దగ్గర ఉన్న సదరు మైనరు బాలిక ఇంట్లోకి కత్తితో చొరబడ్డాడు. ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్తుండగా అడ్డువచ్చిన బాలిక తల్లి లక్ష్మీ, నాయనమ్మ రుక్కమ్మలను కత్తితో పొడిచి అక్కడికక్కడే హతమార్చాడు. అనంతరం ఆ మైనర్ బాలికను దైవాలగూడ సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు దగ్గరకు లాక్కెళ్లి, ఆమె పీక కోసి దారుణంగా హత్య చేశాడు.
ఈ ఆరుగురిని చంపిన తర్వాత నిందితుడు రాజ్‌కుమార్ నేరుగా తన తండ్రి అరుణ్ కుమార్‌కు ఫోన్ చేశాడు. ‘‘నేనే ఆరుగురిని చంపాను, నేను కూడా చనిపోతున్నా’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కంగుతిన్న తండ్రి వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. ఈ ఆరుగురి దారుణ హత్య వార్త తెలియడంతో మృతుల బంధువులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నిందితుడు రాజ్‌కుమార్‌ను తమకు అప్పగించాలంటూ షాబాద్-కంది మెయిన్ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. అతడిని వెంటనే పట్టుకోకపోతే మరికొందరి ప్రాణాలు తీస్తాడని ఆందోళన వ్యక్తం చేయడంతో షాబాద్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
