Raajneeti 2: ‘యానిమల్’ మూవీతో మరో గ్రాండ్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు రణబీర్ కపూర్. అలానే ప్రస్తుతం హిందీలో నితీశ్ తివారీ దర్శకత్వంలో రామాయణం మూవీ చేస్తున్నాడు. ఇందులో రణబీర్ రాముడిగా నటిస్తుండగా, యశ్ రావణాసుడిగా నటిస్తున్నాడు. అలానే సీతాదేవి పాత్రను సాయిపల్లవి పోషిస్తోంది. ఈ సినిమా తర్వాత సంజయ్ లీలా భన్సాలీ మూవీ ‘లవ్ అండ్ వార్’లో రణబీర్ కపూర్ నటించాల్సి ఉంది. ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాల తర్వాత రణబీర్ కపూర్ చేసే సినిమా ఏదీ అనే విషయంలో కొంత క్లారిటీ అయితే వస్తోంది. గతంలో ప్రకాశ్ ఝా ‘రాజనీతి’ సినిమాను రూపొందించారు. మహా భారతానికి ఆధునిక భాష్యంగా అనిపించే ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు ప్రకాశ్ ఝా. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయ్యిందని, దానిని రణబీర్ కపూర్ కు వినిపించబోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ రణబీర్ కపూర్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే… అతని కెరీర్ లోనే ఇదో డిఫరెంట్ మూవీ కానుంది.