Rammohan Naidu

Rammohan Naidu: ఎర్రబస్సులు కాదు.. ఎయిర్ బస్సులు తిరిగే రోజిది!

Rammohan Naidu:  ఒకప్పుడు ఎర్రబస్సులు కూడా సరిగ్గా తిరగవని ఈ ప్రాంతాన్ని హేళన చేశారు.. కానీ ఈరోజు కళ్లు తెరిచి చూడండి, అదే నేలపై ఎయిర్‌బస్సులు దిగుతున్నాయి అంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అత్యంత భావోద్వేగంతో ప్రసంగించారు.

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రతీ ఉత్తరాంధ్ర వాసి ఇంట్లో జరిగే ఒక పండుగ అని అభివర్ణించారు.

ఉత్తరాంధ్రకు సింహద్వారం.. మన్యం వీరుడికి గౌరవం!

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రాముఖ్యతను వివరిస్తూ కేంద్ర మంత్రి క్రింది కీలక విషయాలను పంచుకున్నారు..

  • భవిష్యత్తు గేట్‌వే: భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి, పారిశ్రామిక విప్లవానికి ఒక ‘సింహద్వారం’లా నిలవబోతోందని, ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • అల్లూరి పేరు విశ్వవ్యాప్తం: స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టడం ద్వారా ఆయన త్యాగం, కీర్తి ప్రపంచమంతటా మార్మోగిపోతోందన్నారు.

వికసిత్ భారత్ – విజన్ 2047 సాధనే లక్ష్యం!

ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ.. అసాధ్యాలను సుసాధ్యం చేసే సత్తా ప్రధానికే సొంతమని రామ్మోహన్ నాయుడు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ‘విజన్ 2047’, ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ ఆలోచనలు ఒకటై రాష్ట్రంలో ఎక్కడా జరగని రీతిలో వేగవంతమైన అభివృద్ధి జరుగుతోందన్నారు. ఇవాళ ప్రపంచమంతా ఉత్తరాంధ్ర అభివృద్ధి వైపే చూస్తోందని, ఈ ఎయిర్‌పోర్ట్ ఏపీ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలా మారనుందని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *