Rajiv Gandhi: ఆయన చాలా చక్కగా మాట్లాడేవారు, ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయనను ఒక ఉగ్రవాదిగా ఊహించుకోవడమే నాకు చాలా కష్టంగా ఉంది. ఆయన సిగ్గుపడే స్వభావం కలవాడు, మంచి ప్రవర్తన గలవాడు అలాగే అందరినీ నవ్వించేవాడు.
1985లో న్యూయార్క్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఫ్రెడ్ రొస్సెట్టి.. తాను రోజువారీగా కలిసి లంచ్ చేసే ఒక సహోద్యోగి గురించి ‘ఇండియా టుడే’ మ్యాగజైన్‌తో అన్న మాటలు ఇవి. ఆయన అంతలా అభినందించిన వ్యక్తి మరెవరో కాదు.. అప్పుడే ఎఫ్‌బీఐ (FBI) కి దొరికిపోయిన మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది గురు ప్రతాప్ సింగ్ విర్క్ అలియాస్ జాన్ సింగ్! లండన్ నుండి ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పొంది, న్యూయార్క్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఏడాదికి 60,000 డాలర్లు సంపాదిస్తూ, చూడటానికి పక్కా జెంటిల్మెన్లా కనిపించే ఒక టెక్కీ వెనుక ఇంతటి భయంకరమైన ఉగ్రవాద ముఖం దాగి ఉంటుందని రొస్సెట్టితో పాటు ఎవరూ ఊహించలేదు.
భారత ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ‘మహా స్కెచ్’
ఎఫ్‌బీఐ సేకరించిన ఆధారాల ప్రకారం.. గుర్ప్రతాప్ సింగ్ బిర్క్ కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమే కాదు, హింసాత్మక మార్గాల ద్వారా భారత ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్న ఒక ఉగ్రవాద నెట్‌వర్క్‌కు ప్రధాన సూత్రధారి. భారతదేశంలోని వ్యూహాత్మక వంతెనలు, రైళ్లు, ప్రభుత్వ భవనాలతో పాటు ఒక అణు విద్యుత్ ప్లాంట్‌ను కూడా పేల్చివేయాలని ఈ ముఠా ప్లాన్ చేసింది.
అంతేకాదు, 1985 జూన్‌లో అప్పటి భారత యువ ప్రధాని రాజీవ్ గాంధీ అమెరికా పర్యటనకు రానున్న నేపథ్యంలో, అక్కడ ఆయనను దారుణంగా అస్సాసినేట్ (హత్య) చేయడానికి బిర్క్ ఒక భారీ కుట్ర పన్నాడు. ఇందుకోసం బిర్క్ ఇంకా అతని అనుచరులు అమెరికాలోని ఒక రహస్య శిక్షణా శిబిరంలో పేలుడు పదార్థాలు, ఆటోమేటిక్ ఆయుధాలు, కెమికల్ వార్ఫేర్ (రసాయన యుద్ధం), అర్బన్ గెరిల్లా వ్యూహాలపై ప్రత్యేక శిక్షణ కూడా పొందారు.
ఎఫ్‌బీఐ అండర్ కవర్ ఆపరేషన్.. ‘గాంధీ ప్లాట్’ భగ్నం!
అక్టోబర్ 1984లో ఇందిరా గాంధీ హత్య జరిగిన తర్వాత పంజాబ్‌లో ఉగ్రవాదం తీవ్రస్థాయికి చేరింది. విదేశాల్లోని సిక్కు ప్రవాస సమాజంలో (డయాస్పోరా) కూడా కొన్ని వర్గాల నుండి ఖలిస్తాన్ డిమాండ్‌కు మద్దతు లభిస్తున్న తరుణంలో ఎఫ్‌బీఐ ఈ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టింది.
బిర్క్ ఒక ఆయుధాల స్మగ్లర్‌ను సంప్రదించగా, ఆ స్మగ్లర్ కాస్తా ఎఫ్‌బీఐ ఇన్ఫార్మర్గా మారాడు. ఆ తర్వాత ‘థామస్ నోరిస్’ అనే ఎఫ్‌బీఐ అండర్ కవర్ ఏజెంట్ ఒక పేలుడు పదార్థాల నిపుణుడిగా నటిస్తూ బిర్క్ ముఠాలోకి చొరబడ్డాడు. వారి మధ్య జరిగిన ప్రతి మీటింగ్‌ను ఎఫ్‌బీఐ రహస్యంగా కెమెరాల్లో రికార్డ్ చేసింది.
న్యూజెర్సీలోని అడవుల్లో ఒక టెర్రర్ క్యాంప్ సైట్‌ను పరిశీలించడానికి వెళ్తున్న సమయంలో.. రాజీవ్ గాంధీని చంపగల ఒక హిట్‌మ్యాన్‌ను (షూటర్) ఏర్పాటు చేయాల్సిందిగా బిర్క్ ఆ అండర్ కవర్ ఏజెంట్‌ను కోరాడు. ఈ హత్య కోసం ఆ ముఠా ఏకంగా 60,000 డాలర్లు చెల్లించడానికి కూడా సిద్ధపడింది. ఈ విషయాలన్నీ తదనంతరం భారతదేశంలో ఏర్పాటైన ‘జైన్ కమిషన్’ నివేదికలో కూడా నమోదయ్యాయి.
భజన్ లాల్ ప్రాణాల కోసం కుట్ర గుట్టు రట్టు!
నిజానికి, అమెరికాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదుల పెద్ద నెట్వర్క్ మొత్తాన్ని ఒకేసారి ఆధారాలతో పట్టుకోవాలని ఎఫ్‌బీఐ భావించింది. కానీ అంతలోనే అకస్మాత్తుగా సీన్ మారింది. వైద్య చికిత్స కోసం అదే సమయంలో అమెరికా (న్యూ ఓర్లీన్స్) కు వచ్చిన హర్యానా బలమైన నాయకుడు, అప్పటి సీఎం భజన్ లాల్‌ను కూడా చంపాలని బిర్క్ ముఠా ప్లాన్ మార్చుకుంది.
భజన్ లాల్ ఉన్న హోటల్ వెలుపల బిర్క్ గ్రూప్ ఆయుధాలతో పొంచి ఉందనే పక్కా సమాచారంతో ఎఫ్‌బీఐ దర్యాప్తు అధికారులు మే 4, 1985 న వారిని అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది. భజన్ లాల్ ప్రాణాలను కాపాడటం కోసం ఎఫ్‌బీఐ ఈ యాక్షన్ తీసుకోవడంతో, వారి పెద్ద ఆపరేషన్ కవర్ ముందే క్లోజ్ అయిపోయింది.
విజయవంతమైన కుట్ర.. విఫలమైన కుట్రలు!
ఈ అరెస్టుల తర్వాత రాజీవ్ గాంధీ అమెరికా పర్యటన సురక్షితంగా సాగింది. బిర్క్కు అమెరికా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించగా, అతని అనుచరులు లాల్ సింగ్, అమ్మండ్ సింగ్ తప్పించుకున్నారు. (అమ్మండ్ సింగ్ 1988లో సియాటిల్ కార్ యాక్సిడెంట్లో చనిపోగా, లాల్ సింగ్ 1992లో ముంబైలో పట్టుబడ్డాడు).
ఈ అమెరికా కుట్ర భగ్నమైన ఆరేళ్ల తర్వాత.. అంటే మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో ఎల్టీటీఈ (LTTE) చేసిన ఆత్మహుతి దాడిలో రాజీవ్ గాంధీ చనిపోయారు. చరిత్రలో 1991 నాటి ఎల్టీటీఈ దాడి మాత్రమే ‘విజయవంతమైన కుట్ర’గా అందరికీ గుర్తుంది. కానీ జైన్ కమిషన్ నివేదిక ప్రకారం.. 1984 నుండి 1991 మధ్య కాలంలో రాజీవ్ గాంధీ ప్రాణాలు తీయడానికి తెరవెనుక ఎన్నో భయంకరమైన కుట్రలు జరిగాయి, అందులో అమెరికా వేదికగా సాగిన ఈ ఎఫ్‌బీఐ ‘గాంధీ ప్లాట్’ దర్యాప్తు అత్యంత కీలకమైనది.
