Raghunandan Rao: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఎమ్మెల్సీ కల్వకుంట కవితకి సంబంధించిన వివాదాన్ని ఆయన “ఫ్యామిలీ డ్రామా”గా పేర్కొన్నారు. “తెలంగాణలో దేవుళ్లు ఉన్నారా, దెయ్యాలు ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది. దేవుడి పక్కన దెయ్యం ఉంటే 12 ఏళ్లుగా మీరు ఏం చేశారు?” అంటూ బీఆర్ఎస్ పార్టీపై ఘాటుగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్‌లో గ్రూపులు సృష్టిస్తూ, ఒకరిని వదిలి మరొకరికి వెళ్ళేలా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. తండ్రి కేసీఆర్, కూతురు కవిత మధ్య వ్యవహారాలకు మధ్యవర్తులు అవసరమెందుకు అని ఆయన ప్రశ్నించారు. తన రాజకీయ అనుభవం ప్రకారం కవిత ఇప్పటికే కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన?
రాష్ట్ర అవిర్భావ దినోత్సవమైన జూన్ 2న కవిత తన కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. అనంతరం పాదయాత్ర చేయవచ్చని కూడా చెప్పారు. ఇదివరకూ కూడా కవిత కాంగ్రెస్‌లోకి వెళ్తారన్న ఊహాగానాలు, షర్మిళ తరహాలో పార్టీ విడిచి వెళ్లే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు ఆయన చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మాత్రం ఏకంగా కొత్త పార్టీ ఏర్పాటు పై వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కవిత పార్టీ పెట్టే అంశంపై ఆయనకు వాస్తవ సమాచారం ఉందా? లేక ఇది కేవలం రాజకీయ విమర్శల వేదికలో భాగమేనా? అన్నది వచ్చే రోజుల్లో కవిత తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.