Modi: దేశంలో ఉగ్రవాద దాడుల ద్వారా అశాంతి సృష్టించాలనే ప్రయత్నాలను భారత్ సహించదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రస్తావించారు.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని యుద్ధ తంత్రంగా మార్చింది
ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఒక యుద్ధ వ్యూహంగా తీసుకుంటోందని, భారత్ మాత్రం దీన్ని ధైర్యంగా, సమర్థంగా ఎదుర్కొంటోందని మోదీ వ్యాఖ్యానించారు. “ఉగ్రవాదుల అంత్యక్రియలకు అక్కడి ప్రభుత్వ అధికారులు హాజరవడం, సైన్యం సెల్యూట్ చేయడం… ఇవన్నీ పాకిస్థాన్ ఉగ్రవాదానికి అధికార మద్దతు ఇస్తోందన్న దానికి నిదర్శనాలు,” అని విమర్శించారు.
శాంతి కోరే దేశం – కానీ ఉపేక్షించేది లేదు
“భారత్ శాంతిని కోరే దేశం. కానీ పరోక్ష యుద్ధాల ద్వారా మమ్మల్ని పరీక్షిస్తే మాత్రం మౌనంగా ఉండేది లేదు,” అని ఆయన స్పష్టం చేశారు.
వల్లభ్‌భాయ్ సూచనలు పట్టించుకున్నా ఉంటే…
1947లో దేశ విభజన జరిగిన వెంటనే కశ్మీర్‌లో మొదటి ఉగ్రదాడి జరిగిందని గుర్తుచేశారు. అప్పట్లో పాకిస్థాన్ ముఠాలను ఉపయోగించి కశ్మీర్‌లోని కొంత భాగాన్ని ఆక్రమించిందని చెప్పారు. “అప్పుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇచ్చిన సలహాను పాలకులు అమలు చేసి ఉంటే, ఈ రోజు ఉగ్రవాద దాడుల పరంపర ఉండేది కాదు” అని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణ ప్రజలే లక్ష్యం
పర్యాటకులు, యాత్రికులు, సామాన్య పౌరులే ఉగ్రవాద దాడులకు గురవుతున్నారని, ఇటీవల పహల్గామ్‌లో జరిగిన దాడి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పారు.