Peddapalli: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ విషయంలో ప్రొటోకాల్ రగడ మొదలయ్యింది. అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని, శిలాఫలకాల్లో అధికారులు తన పేరు పెట్టడం లేదని, ఇలా ఎవరు చేయిస్తున్నారో, ఎందుకు చేయిస్తున్నారో కనుక్కోవాలి అంటూ ఎంపీ వంశీకృష్ణ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నది. ఈ వ్యాఖ్యలు అటు.. కాంగ్రెస్ పార్టీలో, ఇటు.. జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌లోని 7 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇందులో ఎంపీ వంశీ కృష్ణ తండ్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నుంచి, పెద్దనాన్న గడ్డం వినోద్ కుమార్ బెల్లంపల్లి నుంచి గెలుపొందారు. మంథని నుంచి గెలుపొందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
Peddapalli: ఎంపీ వంశీకృష్ణ మంత్రి, ఎమ్మెల్యేల కంటే వయసులో చిన్నవాడు. పార్టీ నిర్వహించే కార్యక్రమాలతో పాటు, పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కాకపోయినా కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఎంపీ హాజరవుతున్న కొన్ని కార్యక్రమాలకు సైతం అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఆయన ఆరోపణ… తనకు ప్రొటోకాల్ పాటించకుండా ఎవరైనా నిలువరిస్తున్నారా అనే అనుమానాలు ఎంపీ వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మంచిర్యాలలో జిల్లాలో గడ్డం వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వడం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలకు ఏ మాత్రం ఇష్టం లేదనే గుస్సాగుస్సాలు ఇపుడు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు దవాఖాన ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను పిలవలేదని, ప్రొటోకాల్ పాటించలేదని ఎంపీ అనుచరులే తీవ్రంగా మండిపడ్డారు. ఈనెల 4న పెద్దపల్లిలో జరిగిన సీఎం హాజరైన యువ వికాసం బహిరంగ సభలో కూడా తన విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదని వ్యాఖ్యానించారు. తాజాగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రెస్‌మీట్‌లు పెట్టి మరోసారి ప్రొటోకాల్ అంశంతో పాటు ప్రభుత్వ జీవో ఉన్నా కూడా కాకా వెంకటస్వామి వర్ధంతిని అధికారికంగా కొని చోట్ల నిర్వహించ లేదని ఆరోపించారు.
Peddapalli: ఎంపీ వంశీ విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రొటోకాల్ పాటించకపోవడానికి అసలు కారణం మంత్రి పదవి అని తెలుస్తున్నది. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన గడ్డం వివేక్ మంత్రి పదవి కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రభుత్వంలో కాక కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామంటూ పలుమార్లు ప్రకటించారు. ఇది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే ఉన్న మంత్రితో పాటు ఎమ్మెల్యేలకు సైతం రుచించడం లేదనే చర్చ నడుస్తున్నది.
మంత్రి పదవి కోసం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే వివేక్ సోదరుడు గడ్డం వినోద్ సైతం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మొన్నటి దాకా మంచిర్యాల జిల్లా వరకే పరిమితమైన ఆధిపత్య పోరు.. ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ మొత్తం సోకినట్లు కనబడుతున్నది. మంత్రి పదవి వివేక్ రావడం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలకు ఇష్టం లేదని.. ప్రస్తుత పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి.
Peddapalli: వివేక్‌కి మంత్రి పదవి ఇస్తే ఆయన కుమారుడు ఎంపీగా ఉండి పెద్దపల్లి మొత్తాన్ని వారి చేతుల్లోకి తీసుకునే ప్రమాదముందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గడ్డం సోదరుల్లో ఎవరికి మంత్రి పదవి వచ్చినా… తమకు ఇబ్బందులు తప్పవనే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే మంత్రిగా ఉన్న తను పెద్దపల్లి పార్లమెంట్‌పై పట్టు కోల్పేయే ప్రమాదముందని మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు సైతం భావిస్తున్నారని, అందుకే మంత్రి పదవి విషయంలో ఆయన గడ్డం కుటుంబానికి సపోర్టు చేయడం లేదని సమాచారం.
గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టూర్ సందర్భంగా శ్రీధర్‌బాబు మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్‌ఆర్‌కు మద్దతుగా మాట్లాడం సైతం దీనికి బలం చేకూరుస్తున్నది. పైగా పార్లమెంట్ పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్‌బాబుకు విధేయులేనని.. ఈ మేరకు అంతా ఒక్కటయ్యారని.. అందుకే ఎంపీకి ప్రాధాన్యం తగ్గిందని, ఆయన విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదనే ప్రచారం ఇప్పుడు హస్తం పార్టీలో అగ్గి రాజేస్తున్నది…. మరో పక్క అధికారుల తీరుపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానని ఎంపీ అనడంతో ఈ ప్రొటోకాల్ రగడ ఎటువైపు దారి తీస్తుంది.. అసలు ఏం జరగనున్నదోననే అంశం రసవత్తరంగా మారింది..
రాసినవారు: లక్కాకుల శ్రీనివాస్
మహాన్యూస్ స్టాప్ రిపోర్టర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా..