Priyadarshi: హీరోల చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించటమే కాకుండా హీరోగా నటిస్తూ ముందుకు సాగుతున్నాడు ప్రియదర్శి. తాజాగా ప్రియదర్శి నటించిన ’35 చిన్న కథ కాదు’ చక్కటి విజయం సాధించింది. అంతకు ముందు ‘బలగం’తో బిగ్ హిట్ అందుకున్నాడు ప్రియదర్శి. ప్రస్తుతం పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రియదర్శి నటించిన ఓ సినిమా తాజాగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో రిలీజ్ అయింది. ‘తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి’ పేరుతో వచ్చిన క్రైమ్ థ్రిలర్ ఈ ఏడాది ఆరంభంలో థియేటర్లలో రిలీజ్ అయింది. ఫిబ్రవరి 23న రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన సంగతే చాలా మందికి తెలియదు. అయితే సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రియదర్శి నటించిన ఈ చిత్రం బ్యాంకు దోపిడి చుట్టూ తిరుగుతుంది. నారాయణ చెన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వివేక్ రామస్వామి సంగీతం అందించారు. థియేటర్లలోకి వచ్చినట్లే తెలియని ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.