Puri Jagannadh

Puri Jagannadh: బతిమిలాడితే సినిమా కొన్న.. రూ.40 కోట్లు ముంచేశారు.. పూరీ, ఛార్మిపై నిర్మాత ఫైర్

Puri Jagannadh: సినిమా ఇండస్ట్రీ లో ఎంత గ్లామర్ ఉంటాదో అంతకు మించి తెరవెనుక ఆర్థిక లావాదేవీలు, డిస్ట్రిబ్యూషన్ వివాదాలు ఎంతటి చీకటి కోణాలను ఉంటాయో చెప్పే మరో పెద్ద వివాదం టాలీవుడ్‌లో రచ్చకెక్కింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా బిజినెస్ వ్యవహారంపై డిస్ట్రిబ్యూటర్, ‘హను-మాన్’ సినిమా నిర్మాతల్లో ఒకరైన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత చైతన్య రెడ్డి ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ సంచల విషయాలు బయటపెట్టారు. ఈ సినిమా పంపిణీ హక్కుల వల్ల తాము ఏకంగా రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు నష్టపోయామని, పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ తమను పూర్తిగా మోసం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సినిమా ఆగితే మా కెరీర్, జీవితం ముగిసిపోతుంది అన్నారు..

చైతన్య రెడ్డి తన ఇంటర్వ్యూలో ‘డబుల్ ఇస్మార్ట్’  సినిమా విడుదల ముందు జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు..  భారీ మొత్తానికి థియేట్రికల్ హక్కులు తీసుకున్న సమయంలో.. ‘లైగర్’తో పాటు పూరీ గత సినిమాల నష్టాలను, పాత ఫైనాన్షియల్ వివాదాలను ఆగస్టు 1 నాటికే క్లియర్ చేయాలని తాము షరతు పెట్టామన్నారు. కానీ విడుదల తేదీ (ఆగస్టు 15, 2024) వరకు కూడా ఆ పాత వివాదాలు పరిష్కారం కాకపోవడంతో మార్నింగ్ షోలు ఆలస్యమై, పబ్లిసిటీ తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు.
ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ & తప్పుడు హామీలు..
సినిమా రిలీజ్ ముందు ఛార్మి తమ కాళ్లు పట్టుకున్నంత పనిచేసిందని, “మీరు ఇప్పుడు వెనక్కి తగ్గితే మా కెరీర్, జీవితాలు అంతమైపోతాయి” అంటూ తీవ్ర భావోద్వేగంతో వేడుకున్నారని చైతన్య రెడ్డి ఆరోపించారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే భవిష్యత్తులో ప్రాజెక్టులు చేసి ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని మౌఖికంగా మాటిచ్చారని, అగ్రిమెంట్లు తిరగరాయాలని కోరినా తప్పుడు హామీలతో కాలయాపన చేశారని తెలిపారు.
బాక్సాఫీస్ డిజాస్టర్.. ఆ తర్వాత ఫోన్లు బ్లాక్!
తీరా సినిమా విడుదలైన తర్వాత భారీ నెగెటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ప్రైమ్ షో డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని నష్టం వాటిల్లింది. సినిమా పోయిన తర్వాత ఛార్మి తన నంబర్‌ను బ్లాక్ చేసిందని, పూరీ జగన్నాథ్ ఏకంగా తన ఫోన్ నంబర్‌నే మార్చేసి అందుబాటులో లేకుండా పోయారని చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాగోలా కష్టపడి ప్రైమ్ షో నిర్మాత నిరంజన్ రెడ్డి ముంబై వెళ్లి పూరీ, ఛార్మిలను కలిస్తే.. అక్కడ వారు ఇచ్చిన ప్రతిపాదన విని షాక్ తిన్నారని చెప్పారు. ఇప్పటికే రూ.40 కోట్లు మునిగిపోయిన తమతో కొత్త సినిమా చేయాలంటే.. రూ.15 కోట్ల పారితోషికం ఇవ్వాలని, కథ తమకు నచ్చినదే ఉండాలని, లాభాల్లో 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారని వెల్లడించారు.
పూరీ కెరీర్‌పై పడుతున్న మచ్చ..

తెలుగు సినీ చరిత్రలో సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ చుట్టూ ‘లైగర్’ వివాదం తర్వాత, ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ వ్యవహారం కూడా ఆయన ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రైమ్ షో నిర్మాతలు చేసిన ఈ బాంబు లాంటి ఆరోపణలపై పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ వైపు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. వారి వివరణ వస్తేగానీ ఈ వివాదంలో పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *