Khairatabad Assembly Constituency

TG News: ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీటు ఖాళీ.. ఉపఎన్నికలో దిమ్మతిరిగే ఫలితం ఉంటుంది.. దానం

Khairatabad Assembly Constituency: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు తెలంగాణ శాసనసభ సచివాలయం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు వెలువరించిన తుది తీర్పు ఆధారంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసినట్లు శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి సోమవారం (సెప్టెంబర్ 28) ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దానం నాగేందర్ శాసనసభ్యత్వాన్ని కోల్పోయి మాజీ ఎమ్మెల్యేగా మారారు.

2024 ఏప్రిల్ 23 నుంచే అనర్హత అమలు..

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే దానం నాగేందర్‌పై అనర్హత వేటు అమల్లోకి వస్తుందని అసెంబ్లీ గెజిట్‌లో స్పష్టం చేశారు. ఆ రోజు నుంచే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేశారు.
శాసనసభ స్పీకర్ నిర్ణయంతో అసెంబ్లీ సీటు ఖాళీ అయిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) పంపించారు. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక జరగడం ఖాయమైంది.
న్యాయపోరాటం – సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఏప్రిల్ 23న కాంగ్రెస్ బీ-ఫామ్‌తో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేశారు.
దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా.. దానిని స్పీకర్ తిరస్కరించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు డివిజన్ బెంచ్ స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేస్తూ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాటి నుంచే దానం అనర్హుడని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. 2026 సెప్టెంబర్ 18న అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
“ఉపఎన్నికలో దిమ్మతిరిగే ఫలితం ఉంటుంది” – దానం ధీమా:
గెజిట్ వెలువడటానికి కొద్దిగంటల ముందే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో సీఈసీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్న దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు:
“ఖైరతాబాద్ ఉపఎన్నికలో దిమ్మతిరిగే ఫలితం రాబోతోంది. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అలాంటి తీర్పును ప్రజలు ఇస్తారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రభావం ఖైరతాబాద్‌పై ఉండదు” అని స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని, కిషన్‌రెడ్డి గెలిచింది కూడా ఆ విధంగానేనని ఆరోపించారు. సీఈసీ వెంటనే రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *