Viral News: పుస్తకాల సంచి భుజాన వేసుకుని బడికి వెళ్లాల్సిన వయసు.. పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దాల్సిన బాల్యం.. కానీ ఆ ఎనిమిదేళ్ల పసివాడి చేతికి మాత్రం గొర్రెల కాపరి కర్ర వచ్చింది. కడుపునిండా తిండి పెట్టే దిక్కులేక, కాళ్లకు నడవలేని నొప్పులతో అల్లాడుతూ.. “అన్నా నన్ను మా అమ్మ దగ్గరకు తీసుకెళ్లండి” అంటూ ఆ పసివాడు కన్నీరుమున్నీరైన దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను పిండేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో వెలుగుచూసిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
రోడ్డు పక్కన నడవలేక కూలబడి.. కన్నీటితో వేడుకోలు..
ప్రకాశం జిల్లా రాచవారిపాలెం పరిసరాల్లో ఓ చిన్న బాలుడు గొర్రెల మంద వెనుక నడుస్తూ కనిపించాడు. కాళ్లు విపరీతంగా లాగుతుండటంతో కనీసం అడుగు కూడా తీసి అడుగు వేయలేని దీనస్థితిలో రోడ్డు పక్కనే ఆగిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు ఆ చిన్న పిల్లాడిని చూసి ఆగి వివరాలు అడిగారు. అప్పుడు ఆ బాలుడు తన గోడును వెళ్లబోసుకుంటూ వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టాడు.
ఆ బాలుడి పేరు రామయ్య అని, స్వగ్రామం నర్రవాడ అని తెలిసింది. కేవలం 8 నుంచి 9 ఏళ్ల వయసున్న ఈ చిన్నారిని కుటుంబ పరిస్థితుల వల్లో లేదా ఇతర కారణాల వల్లో ఇంటి నుంచి దూరంగా గొర్రెలు కాయడానికి పనిలో పెట్టారు.
“అమ్మకు చెప్పి నన్ను ఇంటికి తీసుకెళ్లండి అన్నా..”
ఆ బాలుడు వీడియోలో చెప్పిన మాటలు రాతి గుండెలను సైతం కరిగిస్తున్నాయి:
అన్నా.. నాకు ఇక్కడ సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదు. రోజంతా నడిచి నడిచి కాళ్లు నొప్పులు పెడుతున్నాయి.. సరిగ్గా నడవలేకపోతున్నాను. నన్ను మా ఇంటికి తీసుకెళ్లండి అన్నా. మా అమ్మకు చెప్పి నన్ను ఇక్కడి నుంచి వచ్చి తీసుకువెళ్లమని చెప్పండి…
పనిలో పెట్టిన వారు సరైన తిండి పెట్టకపోవడం, తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో ఊళ్లకు ఊళ్లు గొర్రెల వెనుక తిరగలేక ఆ పసికందు తీవ్ర మానసిక, శారీరక క్షోభను అనుభవిస్తున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్ – అధికారుల స్పందన కోసం ఎదురుచూపులు..
స్థానికులు తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిన్న వయసులో వెట్టిచాకిరీ చేయిస్తున్న వారిపై, చిన్నారిని పనిలో పెట్టిన వారిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టప్రకారం బాలకార్మిక వ్యవస్థ నేరమని, ఆ పసివాడిని తక్షణమే రక్షించి తల్లి ఒడికి చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం, మహిళా-శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆ బాలుడికి విముక్తి కల్పించి, బడిలో చేర్పించాలని ప్రజలు కోరుతున్నారు.
అన్నా నన్ను ఇంటికి తీసుకెళ్లండి.. నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు
ప్రకాశం జిల్లా రాచవారిపాలెం దగ్గర గొర్రెలు మేపుతూ నడవలేని స్థితిలో ఉన్న 8 ఏళ్ల వయసున్న రామయ్య అనే బాలుడు
బడిలో పాఠాలు చదవాల్సిన వయసులో గొర్రెలను మేపుతూ అవస్థలు పడుతున్న నర్రవాడ గ్రామానికి చెందిన బాలుడు
అన్నా… pic.twitter.com/RE7lkWTOk7
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2026
