PM Modi

PM Modi: భోగాపురం విమానాశ్రయం ఆంధ్రా యువతకు కొత్త లాంచ్ ప్యాడ్!

PM Modi: అందరికీ నమస్కారం! అంటూ స్వచ్ఛమైన తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం సభలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. పవిత్రమైన ఉత్తరాంధ్ర నేలపై అడుగుపెట్టడం తన అదృష్టమని చెబుతూ, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామికి, అనకాపల్లి పైడితల్లి అమ్మవారికి శిరస్సు వంచి ప్రణామాలుర్పించారు.

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం ప్రారంభించిన ప్రధాని, దీనితో పాటు రాష్ట్రానికి సంబంధించి సుమారు రూ. 18,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

థింసా నృత్యం నా మనసును హత్తుకుంది

సభకు ముందు 13,000 మంది గిరిజన బాలికలు, మహిళలు ఏకకాలంలో ‘ధింసా’ నృత్యం చేసి సాధించిన గిన్నిస్ రికార్డును ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు:

“ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ద్వారా వినూత్న అభివృద్ధి రికార్డు సృష్టిస్తే.. మన గిరిజన సోదరీమణులు థింసా నృత్యంతో గిన్నిస్ రికార్డు సృష్టించారు! ఈ నృత్యంలో మన తరతరాల సాంస్కృతిక వారసత్వం కనిపించింది. అభివృద్ధిని, సంస్కృతిని ఒకేలా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజన్‌కు నా హృదయపూర్వక అభినందనలు.”

గతంలో ఒక్క కుటుంబం పేర్లే ఉండేవి.. ఇప్పుడు విప్లవ వీరుల పేర్లు!

పేరు మార్పులపై గత పాలకుల వైఖరిని ఎండగడుతూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు:

  • గత పాలకుల ధోరణి: గతంలో దేశంలో ఎక్కడ కొత్త విమానాశ్రయం నిర్మించినా కేవలం ఒక్క రాజకుటుంబం పేరు మాత్రమే పెట్టేవారు. కానీ మన ప్రభుత్వంలో అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మీకి పేరు, పంజాబ్‌లో సంత్ రవిదాస్ పేరు పెట్టాం. ఇవాళ భోగాపురం విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. 

  • విమానయాన రంగంలో విప్లవం: 2014కు ముందు దేశవ్యాప్తంగా కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవని, తమ 12 ఏళ్ల పాలనలో ఆ సంఖ్యను 166కి పెంచామని చెప్పారు. ‘ఉడాన్’ పథకం ద్వారా హవాయి చెప్పులు వేసుకునే సామాన్యుడు కూడా విమానం ఎక్కేలా కలలను నిజం చేశామని హర్షం వ్యక్తం చేశారు.

భోగాపురం – ఆంధ్రా యువత ఉజ్వల భవిష్యత్తుకు లాంచ్ ప్యాడ్!

భోగాపురం విమానాశ్రయం కేవలం విమానాలు ల్యాండ్ అయ్యే ప్రదేశం మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర శరవేగవంతమైన ప్రగతికి ఒక ‘కొత్త రన్‌వే’ అని, ఆంధ్రా యువత ఉజ్వల భవిష్యత్తుకు ‘లాంచ్ ప్యాడ్’ లాంటిదని ప్రధాని మోదీ అభివర్ణించారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ రావడంతో ఏపీ అభివృద్ధి డబుల్ స్పీడ్‌తో సాగుతోందని, వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ‘గ్రోత్ ఇంజిన్’గా నిలవనుందని స్పష్టం చేశారు.

శంకుస్థాపనలు & జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులివే:

  1. ఏపీ తొలి సెమీకండక్టర్ ప్లాంట్ (విశాఖ): ASIP టెక్నాలజీస్ ఆధ్వర్యంలో కొరియాకు చెందిన APACT సంస్థ భాగస్వామ్యంతో ఏటా 9.6 కోట్ల చిప్‌లను తయారు చేసే ఏపీలోనే తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

  2. గ్రీన్ ఎనర్జీ రంగానికి ఊతం: కర్నూలు విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్, అనంతపురం (2,500 MW), కర్నూలు (1,000 MW) సోలార్ గ్రిడ్ లైన్లను ప్రారంభించారు.

  3. హైవేలు & వంతెనలు: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ 4-లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే, తాడిపత్రి బైపాస్ రహదారులను ప్రారంభించడంతో పాటు.. NH-565 పై పెంచలకోన – ఏర్పేడు మధ్య లింగసముద్రం వద్ద నిర్మించే హైలెవల్ వంతెనకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

సముద్ర ఆధారిత వనరులను వాడుకుంటూ ‘బ్లూ ఎకానమీ’ని అభివృద్ధి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో దేశానికే తలమానికగా మారబోతోందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *