చారిత్రక నేపథ్యం – సెప్టెంబర్ 17 ప్రాధాన్యత..
నిజాం హయాంలో హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చినప్పటికీ, అదే సమయంలో వెట్టిచాకిరీ, దోపిడీ, అణచివేతలు తీవ్రస్థాయికి చేరాయని సీఎం గుర్తుచేశారు. నిజాం పాలన చివరి పదేళ్లలో రజాకార్ల దౌర్జన్యాలు మితిమీరిపోయాయని పేర్కొన్నారు.
1948 సెప్టెంబర్ 17న భారత సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం యూనియన్లో విలీనమైందని తెలిపారు. ప్రజాపాలన అంటే ప్రజల హక్కులను కాపాడటమేనని, అందుకే సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తూ ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతున్నామని చెప్పారు.
సంక్షేమ పథకాలు – రేవంత్ వెల్లడించిన లెక్కలివే..
మహిళా సాధికారత & ఉచిత పథకాలు
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత గృహజ్యోతి విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు.
రేషన్ & ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్రంలో 3 కోట్ల 42 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తొలి దశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
రైతు సంక్షేమం
రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. మొత్తం 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.72 లక్షల కోట్లు వెచ్చించామని వెల్లడించారు.తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని తెలిపారు.
విద్య, వైద్యం, సామాజిక న్యాయం..
ప్రజా ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్లని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని చెప్పారు. యువతలో నైపుణ్యాల కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెస్తున్నామన్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేశామన్నారు.కులగణనను పూర్తి శాస్త్రీయంగా నిర్వహించామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్ర/రాష్ట్రపతి ఆమోదానికి పంపామని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణను విజయవంతంగా అమలు చేశామన్నారు.
ఆధునిక తెలంగాణ లక్ష్యాలు – మెట్రో & ఫ్యూచర్ సిటీ..
కృష్ణా జలాలు: తెలంగాణకు దక్కాల్సిన న్యాయబద్ధమైన కృష్ణా జలాల వాటా కోసం గట్టిగా పోరాడుతున్నామని చెప్పారు.
మెట్రో & మూసీ పునరుజ్జీవనం:
రూ.38,595 కోట్లతో 122.9 కిలోమీటర్ల మేర హైదరాబాద్ మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించామని, 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.
3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం:
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే కాకుండా, దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచడమే తమ సంకల్పమన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీ:
30 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్ఠాత్మక ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నామని, రాబోయే డిసెంబర్లో జరిగే ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ వేదికగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ను ప్రపంచానికి ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.