Pm modi: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా లేఖ రాసి అతనిని ప్రశంసించారు. అశ్విన్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందని మోడీ పేర్కొన్నారు.
అశ్విన్ తన ఆఫ్ బ్రేక్స్, స్పిన్ బాల్స్ ప్రత్యర్థులను హడలెత్తించడాన్ని గుర్తు చేసిన మోడీ, ఈ రిటైర్మెంట్ నిర్ణయాన్ని కూడా స్పిన్ బాల్‌లా అనూహ్యమైందని వ్యాఖ్యానించారు. జట్టుకు సేవ చేయడంలో అశ్విన్ చూపిన అంకితభావాన్ని కొనియాడారు. తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి జట్టుకోసం పనిచేసిన అశ్విన్ తల్లి ఆసుపత్రిలో ఉన్నప్పటికీ జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశాడని, చెన్నై వరదల సమయంలో సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన దృక్పథాన్ని ప్రశంసించారు.
“ఇకపై జెర్సీ నంబర్ 99ని మేము మిస్ అవుతాం,” అని మోడీ ఆ లేఖలో పేర్కొన్నారు. భారత క్రికెట్ కోసం అశ్విన్ ప్రదర్శించిన అద్భుత కృషి చరిత్రలో నిలిచిపోతుందని, దేశానికి అతను అందించిన సేవల కోసం హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
.