Telangana: వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వపరంగా పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు సంకేతాలు కానవస్తున్నాయి. డిసెంబర్ 9 నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉండటంతో ఆ మార్పులు ఇక్కడి నుంచే మొదలవుతాయని పాలకులు ఇచ్చిన హింట్స్‌తో ప్రజల్లో మరింత ఆసక్తి నెలకొన్నది. ఇదే దశలో ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తుడిచేసుకునేందుకు కాంగ్రెస్ సర్కారు ఈ కొత్త సంస్కరణలకు ముందుకు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కీలక చట్టాలను ముందుకు తెచ్చేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు శ్రీకారం చుట్టనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య పాలనాంశాలపై లీకులు కూడా ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం మాత్రం క్లారిటీ ఇచ్చింది.
Telangana: ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కీలకమైన ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇదే సమావేశంలో కులగణన సర్వేపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావస్తుండటంతో మంత్రివర్గ విస్తరణపైనా ఫోకస్ పెట్టిందని, ఇదే ముహూర్తం కావచ్చని పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరిగిందని తెలిసింది. ఇక ప్రకటనే తరువాయి అన్నట్టుగా తెలుస్తున్నది.
అదే విధంగా పంచాయతీ ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. ఈ ఎన్నికల నిర్వహణపైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉన్నది. ఈ దశలో ఎన్నికల షెడ్యూల్ వివరాలను ప్రభుత్వం ప్రకటించవచ్చని కూడా అందరూ భావిస్తున్నారు. అప్పటికే కులగణన పూర్తయ్యే అవకాశం ఉండటంతో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉటుందని భావిస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడుతుందని అనుకుంటున్నారు.
Telangana: ప్రభుత్వంపై ప్రజల్లో నిరాసక్తతను పోగొట్టేందుకు సామాజిక పింఛన్ సొమ్ము పెంపుపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటన ఉంటుందని తెలిసింది. ప్రధానంగా ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఈ పింఛన్ పెంపు అంశంపై కాంగ్రెస్ వైఖరిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిని పోగొట్టుకోవాలంటే పెంపు అనివార్యం అని భావించినట్టు తెలిసింది. రైతు భరోసా ఇవ్వకపాయే అన్న అపవాదును పోగొట్టుకునేందుకు దానిని కూడా పెంచాలని రేవంత్‌రెడ్డి సర్కారు భావిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రైతు భరోసాను పెంచితే పార్టీకి మైలేజీ వస్తుందని, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావిస్తుందని అంటున్నారు.
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన ముగిసే దశలో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే పరిణామాలు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు. అయితే ఇవన్నీ మార్పులు చోటుచేసుకుంటాయా? లేక ఖజానా లేదనే సాకుతో ప్రభుత్వం జంకుతుందా? అన్న విషయాలు కొద్దిరోజుల్లోనే తేలనున్నాయి.