Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటి నుండి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటన కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది.
రేపు పిఠాపురంలో జరగనున్న సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొని స్థానిక ప్రజలతో కలిసి పండుగ జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కొత్తగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. గతంలో వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలను స్వయంగా సందర్శించి, బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పండుగ పూట తమ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం తమ మధ్యకు రానుండటంతో స్థానిక ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
ఈ నెల 10వ తేదీన పవన్ కళ్యాణ్ జిల్లా పోలీస్ అధికారులతో కలిసి ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, పండుగ సమయంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ఆయన సమీక్ష చేస్తారు. అదే రోజు రంగరాయ మెడికల్ కాలేజీలో కొన్ని కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, కందుల దుర్గేష్ కూడా పాల్గొననున్నారు. జిల్లా అభివృద్ధిపై మంత్రులతో కలిసి పవన్ కీలక చర్చలు జరపనున్నారు.
