Pawan Kalyan: జనసేన పార్టీ అంతర్గత వ్యవహారాలు, నేతల పనితీరుపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం జరిగిన జనసేన జనరల్ బాడీ సమావేశంలో ఆయన నేరుగా ఎమ్మెల్యేలు, కీలక నేతలను నిలదీశారు. పార్టీ కోసం కష్టపడని వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
పార్టీ పదవులు అనుభవిస్తున్న నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
- మౌనం వీడండి: పార్టీపైనా, తనపైనా ప్రత్యర్థి పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తుంటే నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. అబద్ధపు ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
- రిపోర్ట్ కార్డ్ సిద్ధం: “పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరు ఎంత పని చేస్తున్నారు? ఎవరు బాధ్యతగా ఉండటం లేదు? అనే పూర్తి సమాచారం నా వద్ద ఉంది” అని నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.
క్రమశిక్షణే ముఖ్యం: పార్టీలో క్రమశిక్షణ తప్పనిసరి అని పవన్ అల్టిమేటం ఇచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ లక్ష్యాలే ముఖ్యమని, ఆ దిశగా పనిచేసే వారికే పార్టీలో స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ నేతల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఇది కూడా చదవండి: Skywalk: రాయదుర్గం టు టీ హబ్.. 500 మీటర్ల స్కైవాక్, 400 మీటర్ల టన్నెల్ సిద్ధం!
కీలక నిర్ణయాలు – మంత్రి నాదెండ్ల వెల్లడి: సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు:
- క్రమశిక్షణ కమిటీ: పార్టీలో క్రమశిక్షణను పర్యవేక్షించేందుకు 32 మందితో త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు.
- PAC పునరుద్ధరణ: పొలిటికల్ అఫైర్స్ కమిటీని (PAC) పునరుద్ధరించి, పార్టీ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించనున్నారు.
- న్యాయం చేస్తాం: కూటమి విజయం కోసం కష్టపడి, త్యాగాలు చేసిన కార్యకర్తలకు, నేతలకు తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు.
- సభ్యత్వ నమోదు: మార్చి 14న జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం లోపు రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరోవైపు, వివాదాస్పదంగా మారిన ఆరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణకు పార్టీ ఒక కమిటీని నియమించింది. వెంటనే కమిటీ ముందు హాజరుకావాలని శ్రీధర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయా లేక అసమ్మతికి దారితీస్తాయా అనేది వేచి చూడాలి.
