Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరావతిలోని పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన ఆయన, మెమోరియల్ పార్కులో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన ‘సేవా గళం’ కమిటీ సభ్యులతో మాట్లాడిన పవన్, పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని కొనియాడారు. కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసమే కాకుండా, దేశంలో భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడటానికి ఆయన త్యాగమే బాటలు వేసిందని గుర్తు చేశారు. అంతటి గొప్ప మహనీయుడిని ఒకే కులానికి పరిమితం చేయడం చాలా బాధాకరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై వస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ గట్టిగా స్పందించారు. తెలంగాణ భారతదేశంలో ఒక భాగమని, అక్కడికి వెళ్ళడానికి, సభలు పెట్టడానికి ఎవరి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ తన ఇల్లు అని, తన పార్టీ జనసేన కూడా అక్కడే పుట్టిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ అభిప్రాయాలు చెప్పుకునే హక్కు ఉంటుందన్నారు. భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినా, ప్రజల మనసులను వేరు చేయలేమని చెప్పారు. రాజకీయాల కోసం ప్రజల మధ్య గొడవలు పెట్టడం సమాజానికి అస్సలు మంచిది కాదని హితవు పలికారు.
తెలంగాణ ప్రాంతం అంటే తనకు ఎంతో ప్రేమ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య వ్యాపారాలు, కాంట్రాక్టులు సాగుతున్నప్పుడు విద్వేషాలు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వివాదంతో సంబంధం ఉండకపోవచ్చని, కానీ కొందరు కాంగ్రెస్ నేతలు కావాలనే దీనిని పెద్దది చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలాగే బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తనకు సోదరుడి లాంటివాడని, ఆయన తనపై తప్పుగా మాట్లాడి ఉండరని నమ్ముతున్నట్లు చెప్పారు. రాష్ట్రం విడిపోయి ఇన్నేళ్లయినా ఇంకా ప్రాంతీయ గొడవలు రేపడం బాధాకరమని, యువతకు ఐక్యత, అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుత రాజకీయాల్లో కులాల గొడవలు ఎక్కువైపోవడంపై పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు తప్పు చేస్తే, ఆ వ్యక్తిని అనకుండా మొత్తం కులాన్ని తిట్టడం ప్రమాదకరమైన పద్ధతి అని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో కుల రాజకీయాలు మరీ ఎక్కువయ్యాయని, చివరకు జర్నలిస్టులను కూడా కులం పేరుతో దూషించారని మండిపడ్డారు. ఏ ఒక్క కులం ఓట్లతోనే ఎవరూ గెలవరని, అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే నాయకులు అవుతారని గుర్తు చేశారు.
అభివృద్ధి, ఉద్యోగాలు, ప్రజా సంక్షేమం వంటి ముఖ్యం విషయాలపై చర్చలు జరగాలి కానీ, కులాల చుట్టూ రాజకీయాలు తిరగడం దేశానికి మంచిది కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. కులాలకు అతీతంగా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీ ‘సేవా గళం’ కార్యక్రమాన్ని తెచ్చిందని వివరించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు గొడవలు పక్కన పెట్టి, ఒకరినొకరు గౌరవించుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
