Yeshanagula: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘దసరా’ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్-ఇండియా సినిమా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఫస్ట్ సాంగ్ ‘ఆయా షేర్’ (Aaya Sher) సృష్టించిన సంచలనం తర్వాత, తాజాగా మూవీ టీమ్ విడుదల చేసిన రెండో సింగిల్ ‘యేష నాగుల’ (Yesha Nagula) పాటతో అంచనాలు మరింత పెరిగాయి. పక్కా తెలంగాణ నేటివిటీతో కూడిన జానపదానికి రాకింగ్ మాస్ బీట్స్ జోడించి సిద్ధం చేసిన ఈ పాటప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అమెరికాలోని డల్లాస్‌లో రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ నిర్వహించిన లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ వేదికగా వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ పాటను లైవ్‌గా పాడి విడుదల చేయడం విశేషం.
జానపదానికి అనిరుధ్ అదిరిపోయే మాస్ టచ్..
తెలంగాణలో ప్రాచుర్యం పొందిన ‘యేష నాగుల కట్ట మీద’ పాటకు అనిరుధ్ తనదైన మార్క్ హై-వోల్టేజ్ బీట్స్, భారీ పెర్కషన్స్ జోడించి బిగ్ స్క్రీన్‌పై అదిరిపోయేలా రీమిక్స్ చేశారు. ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యానికి తోడు, జంగి రెడ్డి రా-ఎనర్జిటిక్ వాయిస్, ప్రభ గానం పాటకు మరింత నేటివిటీని, జోష్‌ను అందించాయి.
‘జాదల్’గా నాని మాస్ స్వాగర్ – ఆట సందీప్ కొరియోగ్రఫీ..
ఈ సినిమాలో ‘జాదల్’ (Jadal) అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న నాని.. తనదైన ఎనర్జీతో, మాస్ బాడీ లాంగ్వేజ్‌తో స్టెప్పులేసి స్క్రీన్‌ను డామినేట్ చేశారు. పొడవాటి మల్లెపూల దండతో హీరోయిన్ కీర్తి సురేష్ తనదైన గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాస్ ప్రేక్షకులు థియేటర్లలో ఈలలు వేసేలా ఆట సందీప్ కొరియోగ్రఫీ చేసిన హుక్ స్టెప్పులు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
సెప్టెంబర్ 24న థియేటర్లలోకి గ్రాండ్ రిలీజ్..
ఎస్ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కదాయు లోహర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి రెండు పాటలతోనే చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌గా నిలిచిన ‘ది ప్యారడైజ్’ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
