Indian Army: ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్‌కు చైనా, తుర్కియే దేశాలు సహకరించాయని భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జులై 4) న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్‌పై ఎఫ్ఐసీసీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పాకిస్తాన్‌కు చైనా ‘లైవ్ ల్యాబ్’, తుర్కియే డ్రోన్ల సాయం:
లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ మాట్లాడుతూ, పాకిస్తాన్ సైనిక హార్డ్‌వేర్‌లో 81% చైనా నుండే వస్తుందని వెల్లడించారు. తన సైనిక సాంకేతికతను పరీక్షించుకోవడానికి చైనా పాకిస్తాన్‌ను ఒక “లైవ్ ల్యాబ్” లాగా ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా నేరుగా పాకిస్తాన్‌కు నిఘా సమాచారం అందించిందని, భారతదేశ కీలకమైన సైనిక కదలికల వివరాలను పంపించిందని తెలిపారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్నప్పుడు, “భారత్ దాడికి సిద్ధంగా ఉందని మాకు తెలుసు” అని పాకిస్తాన్ చెప్పిందని, ఈ నిఘా సమాచారం చైనా నుండే వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
తుర్కియే కూడా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిందని, ఆపరేషన్ సిందూర్ సమయంలో దాడుల కోసం బేరక్తర్ డ్రోన్‌లు, ఇతర మానవరహిత వైమానిక వ్యవస్థలను సరఫరా చేసిందని సింగ్ తెలిపారు. “భారత్ విషయంలో పాకిస్తాన్ ముందు వరుసలో ఉంటే, వెనుక నుంచి చైనా అన్ని విధాలుగా మద్దతు ఇస్తోంది. ఇదే సమయంలో తుర్కియే కూడా తమ మిత్ర దేశానికి తోడ్పాటు అందిస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Thalapathy Vijay: ఎన్నికల బరిలో టీవీకే కీలక ప్రకటన.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్!
‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం, వైమానిక రక్షణ ప్రాముఖ్యత:
ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్ తీవ్రంగా స్పందించిందని, ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా మట్టుపెట్టిందని సింగ్ గుర్తుచేశారు. ఈ దాడులను జీర్ణించుకోలేని పాక్ ఎదురుదాడికి దిగినా, భారత్ తగిన సమాధానం ఇవ్వడంతో కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ సంప్రదింపులు జరిపిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చైనా నుంచి సమీకరించిన హెచ్‌క్యూ-9, ఎల్‌వై-80 వ్యవస్థలు, వాటి రాడార్లు భారత్ ప్రయోగించిన ఒక్క క్షిపణినీ కూడా అడ్డుకోలేకపోయాయని ఆయన వెల్లడించారు.
పాకిస్తాన్, చైనా, తుర్కియేల మధ్య పెరుగుతున్న సైనిక సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని, భారత్ తన వైమానిక రక్షణ, సాంకేతిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలని డిప్యూటీ ఆర్మీ చీఫ్ సూచించారు. డ్రోన్ల ముప్పు, ఆధునిక యుద్ధ వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సాంకేతికంగా అభివృద్ధి చెందిన వాయు రక్షణ వ్యవస్థలను నిర్మించుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.
స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (SIPRI) గణాంకాల ప్రకారం, 2015 నుంచి చైనా పాకిస్తాన్‌కు 8.2 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించింది. 2020 నుంచి 2024 మధ్య చైనా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలవగా, అందులో 63 శాతం పాకిస్తాన్‌కే చేరాయి. 2025 యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) నివేదిక ప్రకారం, భారతదేశం చైనాను తన ప్రధాన శత్రువుగా భావిస్తుండగా, పాకిస్తాన్‌ను ఒక భద్రతా సమస్యగా పరిగణిస్తోంది.