Thalapathy Vijay: తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది (2026) జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వ్యవస్థాపకుడు, స్టార్ హీరో విజయ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. శుక్రవారం చెన్నైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ మేరకు అధికారికంగా తీర్మానం చేసింది. అంతేకాకుండా, రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
‘టీవీకే’ అధినేత విజయ్ మాట్లాడుతూ, తమిళనాడు ఎన్నికల్లో వేర్పాటువాద రాజకీయాలు చేసే పార్టీలతో పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడిన ఆయన, బీజేపీ విద్వేష రాజకీయాలు తమిళనాడులో చెల్లవని అన్నారు. డీఎంకే, బీజేపీలకు తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఇది గతంలోనే ప్రకటించిన తమ పార్టీ విధానమని, దానిపై తాజాగా మరోసారి స్పష్టతనిచ్చారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంగ్ల భాషపై చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని ‘టీవీకే’ తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలు తమిళనాడు ద్విభాషా విధానంపై ప్రత్యక్ష దాడి అని అభివర్ణించింది. తమిళనాడుపై హిందీ, సంస్కృత భాషల్ని బలవంతంగా రుద్దడాన్ని తమ పార్టీ ఎప్పటికీ అంగీకరించదని, అటువంటి ప్రయత్నాలను అడ్డుకుంటామని విజయ్ స్పష్టం చేశారు.
Also Read: Pawan Kalyan: ప్రకాశం జిల్లాకు కొత్త శకం: నీటి సమస్యకు పవన్ కల్యాణ్ పరిష్కారం!
Thalapathy Vijay: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు విజయ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ‘టీవీకే’ నిర్ణయించింది.
గతేడాది ఫిబ్రవరిలో ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని స్థాపించిన విజయ్, పార్టీ స్థాపించి ఏడాది పూర్తైన సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. ఇటీవలే చెన్నైలో విజయ్‌ను ప్రశాంత్ కిషోర్ మర్యాదపూర్వకంగా కలవడంతో, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన విజయ్‌కి సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేశంలో పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ‘టీవీకే’కు కూడా వ్యూహకర్తగా వ్యవహరిస్తుండటంతో, విజయ్ పార్టీపై తమిళనాట అంచనాలు మరింత పెరిగాయి. వచ్చే నెలలో భారీ ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని కూడా పార్టీ ప్రతిపాదించింది.