Omar Abdullah: జమ్మూ కశ్మీర్‌లోని అదనపు జలాలను ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా పంజాబ్‌కు మళ్లించే ప్రతిపాదనపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలోనే నీటి కొరత తీవ్రంగా ఉందని, అలాంటి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు నీటిని తరలించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
జమ్మూలో ప్రతిపాదించిన 113 కిలోమీటర్ల కాలువ ద్వారా నీటిని తరలించే అంశంపై స్పందించిన ఆయన, “ఈ ప్రతిపాదనను నేను పూర్తిగా తిరస్కరిస్తున్నాను. మొదటగా మా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చుకోవాలి. జమ్మూ ప్రాంతంలో ఇప్పటికే తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కరవు పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి వేళ పంజాబ్‌కు నీరు ఎందుకు ఇవ్వాలి?” అని ప్రశ్నించారు.
ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, “సింధూ జలాల ఒప్పందం ప్రకారం ఇప్పటికే పంజాబ్‌కు తగినంత నీరు అందుతోంది. గతంలో మేము నీటి కొరతతో బాధపడుతున్న సమయంలో పంజాబ్ ఏమాత్రం సహకరించలేదు. ఇప్పుడు వారు సహాయం కోరితే మేమెందుకు నీటిని ఇవ్వాలి?” అంటూ అసహనం వ్యక్తం చేశారు.
రావి నదికి సంబంధించి పఠాన్‌కోట్ వద్ద బ్యారేజీ నిర్మాణం ప్రతిపాదనపై ఆయన స్పందిస్తూ, ఇది చాలా కాలంగా వివాదాస్పదంగా మారిందని తెలిపారు. 1979లో జమ్మూ కశ్మీర్–పంజాబ్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినా, దానికి కార్యరూపం దాల్చలేదన్నారు. చివరకు 2018లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని పరిష్కరించినా, ఇప్పటికీ పాత అన్యాయాలు మర్చిపోలేనివేనని ఆయన పరోక్షంగా విమర్శించారు.
ఇక కేంద్ర ప్రభుత్వం సింధూ ఒప్పందం కింద పాకిస్తాన్‌కు వెళుతున్న నీటిని భారత్ లోనే ఉపయోగించాలన్న యోచనలో ఉంది. దీనికి అనుగుణంగా, పంజాబ్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాలకు మిగులు నీటిని మళ్లించే దిశగా జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రయోజనాలకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని, మిగులు జలాలు ఉన్నప్పుడే ఇతర రాష్ట్రాలకు పంపిణీ గురించి ఆలోచించాల్సిందిగా ఒమర్ అబ్దుల్లా తేల్చిచెప్పారు.