Telangana Film Chamber Of Commerce: తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ కార్యాలయం రెంట్ తీసుకుని నిర్వహిస్తున్నామని, ఫిలింనగర్ లో 800 గజాల స్థలం ఇప్పించాలని కోరారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఉన్న ఏ ఒక్క కార్మికునికి చిత్రపురి కాలనీలో ఇల్లు ఇవ్వలేదని, మంత్రిగారిని ఈ వేడుకకు రాకుండా చేయాలని చూసినా మంత్రిగారు వచ్చి మా కోరికలన్నీ తీరుస్తానని చెప్పారన్నారు. 2014లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడిందని, సుమారు 16 వేల మంది 24 విభాగాల నుంచి సభ్యులుగా ఉన్నారని, వారి సంక్షేమం కోసం మా అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలకు ప్రభుత్వం తరుపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సపోర్ట్ ఉండాలని కోరారు.
సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ‘చిత్ర పరిశ్రమ కొందరిది కాదు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న అందరిదీ. మా భూమి నుంచి మొన్నటి బలగం వరకు తెలంగాణ వాళ్లు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. తెలంగాణలో సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ సంకల్పం. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు 800 గజాల స్థలం ఇప్పించేందుకు ప్రభుత్వం తరుపున ప్రయత్నం చేస్తాం’ అన్నారు.