Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఏపీలో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. వర్షాల సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలతో పాటు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో బుధవారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు పడవచ్చు. ఆకస్మికంగా ఈదురుగాలులు వీస్తూ వర్షం పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద, కరెంట్ స్తంభాల పక్కన, పెద్ద పెద్ద ఫ్లెక్సీల (హోర్డింగ్స్) కింద నిలబడకూడదని అధికారులు స్పష్టం చేశారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు ఆకాశంలో మేఘాలు కమ్మి ఉరుములు వినిపించగానే సురక్షితమైన బిల్డింగుల్లోకి వెళ్లాలని, తెగిపడిన కరెంట్ వైర్లకు దూరంగా ఉండాలని కోరారు.
ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉండనుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పోలవరం ప్రాంతాల్లో రేపు 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉంటుందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఇక తెలంగాణలో కూడా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, నారాయణఖేడ్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. రేపు కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇదే స్థాయిలో వానలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
