CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ అల్లర్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా హింసకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పథకం ప్రకారం కుట్రలు పన్నుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ కల్తీ వంటి సున్నితమైన అంశాల్లో తాము చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వైసీపీ నేతలు బూతు పురాణం అందుకుని, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద జరిగిన దాడి ఘటనపై సీఎం ఆరా తీశారు. చట్టాన్ని అతిక్రమించి మైలవరం నియోజకవర్గంలో అల్లర్లకు పాల్పడిన టీడీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, తప్పు చేస్తే మన పార్టీ వారైనా సరే ఉపేక్షించవద్దని, చట్టం తన పని తాను చేసుకుపోవాలని తేల్చి చెప్పారు.
Also Read: Ashwini Vaishnaw: హైదరాబాద్ టు బెంగళూరు.. ఇక కేవలం 2 గంటల్లోనే!
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ నేతల కవ్వింపు చర్యలు ఒక “ట్రాప్” (వల) వంటివని, వారి ఉచ్చులో పడి కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. “హింస, విధ్వంసమే పునాదిగా పుట్టిన పార్టీ ట్రాప్‌లో మనం పడితే.. వారికీ మనకూ తేడా ఉండదు. మన లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులను రాబట్టడం మాత్రమే.” మంత్రులు, నియోజకవర్గ స్థాయి నేతలు క్షేత్రస్థాయిలో ఉండి కార్యకర్తలు సంయమనం కోల్పోకుండా చూసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి అజెండాను దెబ్బతీయాలని చూసే ఏ శక్తినైనా చట్టం ద్వారా అణిచివేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
