Nishikant Dubey

Nishikant Dubey: మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పాలి.. లేదంటే ‘మెటా’ రక్షణ కవచం రద్దు!

Nishikant Dubey: సమాచార మరియు సాంకేతిక పరిజ్ఞానం (IT) పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ (Meta)కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నీట్ (NEET-UG 2026) పేపర్ లీకేజీ ఆందోళనలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను ఫేస్‌బుక్ నుండి తొలగించడంపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒకవేళ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పకపోతే ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద మెటా పొందుతున్న చట్టపరమైన రక్షణను (Safe Harbour Protection) రద్దు చేయాలని కమిటీ స్పష్టం చేసిందన్నారు.

ప్రధాని వీడియోనే 5 గంటలు కనపడకుండా చేస్తారా?

కమిటీ సమావేశం అనంతరం నిషికాంత్ దూబే విలేకరులతో మాట్లాడుతూ మెటా సంస్థ తీరుపై మండిపడ్డారు..

ప్రధాని నరేంద్ర మోదీ కంటెంట్‌ను మెటా ఇండియా ఫేస్‌బుక్ నుండి తొలగించింది. అర్థరాత్రి 12:30 నుండి ఉదయం 5:00 గంటల వరకు అంటే సుమారు 5 గంటల పాటు ప్రధాని వీడియో అందుబాటులో లేదని మెటా ప్రతినిధులే ఒప్పుకున్నారు. ఒక దేశ ప్రధాని వీడియోనే ఇలా తొలగించి, ఆ తర్వాత పునరుద్ధరిస్తారా? గతంలో కూడా 2024 ఎన్నికల సమయంలో జుకర్‌బర్గ్ ఇలాగే వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. ఇదంతా చూస్తుంటే దేశాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందినిషికాంత్ దూబే, ఐటీ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్

జూలై 23న ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పరీక్షల అక్రమాలపై కఠిన చట్టాలు తెస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఇటీవలే పార్లమెంట్ ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు-2026’ను ఆమోదించింది. అటువంటి కీలకమైన వీడియోను బ్లాక్ చేయడం తీవ్రమైన అంశమని కమిటీ పేర్కొంది.

‘సేఫ్ హార్బర్’ అంటే ఏమిటి? ఎందుకు రద్దు చేయాలి?

సమాచార సాంకేతిక చట్టం (IT Act) సెక్షన్ 79 ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్‌కు ఆయా సంస్థలు బాధ్యత వహించకుండా ‘సేఫ్ హార్బర్’ (Safe Harbour) అనే చట్టపరమైన రక్షణ కవచం ఉంటుంది.

అయితే, ప్రభుత్వ నిబంధనలను పాటించడంలో విఫలమైతే లేదా తప్పుడు సమాచారాన్ని నియంత్రించకపోతే ఈ రక్షణను తొలగించే అధికారం కేంద్రానికి ఉంటుంది. ఈ రక్షణ పోతే, ప్లాట్‌ఫారమ్‌లో వచ్చే ప్రతీ పోస్టుకు నిబంధనల ప్రకారం మెటా సంస్థపై నేరుగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది.

చైల్డ్ అబ్యూస్ కంటెంట్, తెలంగాణ సీఎం ఎఫ్‌ఐఆర్ ప్రస్తావన!

సోషల్ మీడియా దిగ్గజాలు గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), స్నాప్‌చాట్, మెటా సంస్థల ప్రతినిధులతో జరిగిన ఈ విచారణలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.

  • చిన్నారులు, మహిళల భద్రత: యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్ (CSAM), మహిళలకు వ్యతిరేకంగా ఉన్న పోస్టులను ఆయా సంస్థలు వేగంగా తొలగించడం లేదని దూబే ఆరోపించారు.

  • హోమ్, ఐటీ శాఖల మాట వినకపోవడం: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గానీ, ఐటీ మంత్రిత్వ శాఖ గానీ ఇచ్చే సూచనలను ఈ సంస్థలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

  • తెలంగాణ ఘటన: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మెటా ఇండియాపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిబంధనలు పాటించని అన్ని విషయాల్లో మెటాకు ఉన్న సేఫ్ హార్బర్ రక్షణను ఎత్తివేయాలని కమిటీ స్పష్టంగా ప్రతిపాదించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *