Crime News: అమెరికాలో జరిగిన తెలుగు విద్యార్థిని నిఖిత గొడిశాల (27) దారుణ హత్య కేసులో ఎనిమిది నెలల తర్వాత కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మను పోలీసులు ఆగ్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అమెరికా ప్రభుత్వం చేసిన అధికారిక అభ్యర్థన మేరకు అతడిని ఆ దేశానికి అప్పగించే (Extradition) ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
అప్పు డబ్బులు అడిగినందుకే దారుణం – తండ్రి ఆరోపణలు..
తన కుమార్తె వద్ద అర్జున్ శర్మ పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకున్నాడని, తిరిగి ఇవ్వమని గట్టిగా నిలదీసినందుకే ఆమెను దారుణంగా హత్య చేశాడని నిఖిత తండ్రి ఆరోపించారు. దీనిపై బాధితురాలి కుటుంబం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై చీటింగ్ కేసు నమోదైంది. నిందితుడు అర్జున్ శర్మ దేశం విడిచి పారిపోయాడని నిర్ధారించిన అమెరికా పోలీసులు భారత అధికారులను సంప్రదించగా.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆగ్రాలో దాక్కున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించారు. ఈ కేసుపై మరింత సమగ్ర విచారణ జరిపించి, తమ కుమార్తెను పొట్టనబెట్టుకున్న నిందితుడికి అమెరికా చట్టాల ప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని నిఖిత తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.
