Swine Flu: దేశ రాజధాని ఢిల్లీలో హెచ్1ఎన్1 (H1N1) ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లోనే కొత్తగా 166 హెచ్1ఎన్1 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,612కు చేరింది. ఇతర ఇన్‌ఫ్లుయెంజా-ఎ కేసులను కూడా కలిపితే మొత్తం కేసుల సంఖ్య దాదాపు 3,300కు చేరుకుంది.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆసుపత్రుల్లో తగిన సంఖ్యలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు ఇంకా టెస్టింగ్ సదుపాయాలు సిద్ధంగా ఉంచినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
“ఇది కరోనా కాదు.. కంగారు పడొద్దు”
కేసులు పెరుగుతుండటంతో కరోనా తరహా పరిస్థితులు మళ్లీ వస్తాయా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. అయితే యశోద ఆసుపత్రి ఇంటర్నల్ మెడిసిన్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ వినయ్ భట్ దీనిపై స్పందిస్తూ..
-
హెచ్1ఎన్1 అనేది కొత్త వైరస్ కాదని, ఇది సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కావడంతో ఎప్పటికప్పుడు కేసులు పెరుగుతుంటాయని స్పష్టం చేశారు.
-
రద్దీగా ఉండే ప్రదేశాలు, సరైన గాలి వెలుతురు లేని గదుల్లో దగ్గరగా ఉన్నప్పుడు ఒకరి నుంచి మరొకరికి ఇది వేగంగా వ్యాపిస్తుంది.
ఎక్కువ ప్రమాదం ఎవరికి?..
సాధారణంగా హెచ్1ఎన్1 సోకినప్పుడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే నయమవుతుంది. అయితే హై-రిస్క్ విభాగంలోని వారు చాలా అప్రమత్తంగా ఉండాలి.
-
హై-రిస్క్ గ్రూపులు: వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు, ఆస్తమా, సీఓపీడీ (COPD) లేదా ఇతర దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారికి ఇది ప్రమాదకరంగా మారవచ్చు. వీరిలో న్యుమోనియా వచ్చే ముప్పు ఎక్కువ.
-
హెచ్చరిక లక్షణాలు: నిరంతర తీవ్రమైన జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి లేదా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు..
-
ఫ్లూ వ్యాక్సినేషన్: హై-రిస్క్ విభాగంలో ఉన్నవారు సకాలంలో వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను, ఆసుపత్రిలో చేరే పరిస్థితిని తగ్గించుకోవచ్చు.
-
స్వీయ నియంత్రణ: జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు కొద్దిరోజులు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. ఇతరులకు వ్యాపించకుండా ఉండాలి.
-
పరిశుభ్రత: దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలు లేదా టిష్యూని అడ్డుపెట్టుకోవాలి. చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వృద్ధులు, రోగుల వద్దకు వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి.
