Nara Lokesh

Nara Lokesh: స్థానిక ఎన్నికల్లో 94 శాతం సీట్లు గెలుస్తాం.. పవన్ మన కుటుంబసభ్యుడే!

Nara Lokesh: రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగిస్తుందని, 94 శాతానికి పైగా స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో మంగళవారం పర్యటించిన ఆయన.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, దివంగత నేత పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తూ, పరిటాల శ్రీరామ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యాక్షనిజం, అరాచకాలపై రాజీలేని పోరాటం చేసిన యోధుడు పరిటాల రవి అని కొనియాడారు.

పవన్ కల్యాణ్ మన కుటుంబసభ్యుడు – స్థానిక సంస్థల్లో తగ్గేదేలే..

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ కుటుంబ సభ్యుడి వంటి వారని, కూటమిలో ఏవైనా సమస్యలుంటే నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు అహంకారాన్ని పక్కనపెట్టి ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని పిలుపునిచ్చారు.
“నాకు తోబుట్టువులు, సొంత అన్నాచెల్లెళ్లు లేకపోయినా.. నందమూరి తారకరామారావు నాకు టీడీపీ రూపంలో కోటి మంది కుటుంబసభ్యులను ఇచ్చారు” అని భావోద్వేగంగా పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆదేశించారు.
పరిటాల రవి పోరాటం – జగన్ సర్కారు వైఫల్యాలపై ఫైర్..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వందలాది మంది కార్యకర్తలను బలిగొన్న ఫ్యాక్షనిజాన్ని, అరాచకాలను ఎదిరించి మహిళల మానప్రాణాలను కాపాడిన నేత పరిటాల రవి అని లోకేశ్ ప్రస్తావించారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణను వరుసగా మూడుసార్లు గెలిపించిన చరిత్ర అనంతపురం గడ్డదని గుర్తుచేశారు.
వైసీపీ హింసాత్మక రాజకీయాలపై విరుచుకుపడుతూ.. “గొడ్డలితో బతికే వారు గొడ్డలితోనే పోతారు” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తన ‘యువగళం’ పాదయాత్రను అడ్డుకునేందుకు అక్రమ జీవోలు తెచ్చి అణచివేయాలని చూశారని మండిపడ్డారు.
డీఎస్సీపై జగన్‌కు సవాల్ – టీచర్లపై దాడులపై రెడ్ బుక్ హెచ్చరిక..
చర్చకు సిద్ధమా?
మెగా డీఎస్సీ నియామకాలపై కోర్టులు మొట్టికాయలు వేసినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని ఆగ్రహించారు. “డీఎస్సీ నిర్వహణ, పారదర్శకతపై నేను ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం.. వైఎస్ జగన్ చర్చకు సిద్ధమా?” అని నేరుగా సవాల్ విసిరారు.
కోర్టు పర్మిషన్లపై ఎద్దేవా
తాము నీతి, నిజాయితీతో ప్రజా జీవితంలో ఉన్నామని.. జగన్‌లాగా విదేశాలకు వెళ్లాలంటే కోర్టుల చుట్టూ తిరుగుతూ పర్మిషన్లు అడుక్కునే పరిస్థితి తమకు లేదని ఎద్దేవా చేశారు.
రెడ్ బుక్ వార్నింగ్

విజయవాడలో విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులపై వైసీపీ రౌడీ మూకలు కోడిగుడ్లతో దాడులకు తెగబడటం అత్యంత హేయమైన చర్యని ధ్వజమెత్తారు. గురువులపై దాడులకు పాల్పడిన ఒక్కరినీ వదిలిపెట్టబోమని, చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరి పేర్లు తన రెడ్ బుక్కులో నమోదయ్యాయని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *