Nara lokesh; తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సభ్యత్వాలు కోటి దాటిన సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ సందర్బంగా, ఆయన కార్యకర్తలను అభినందిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు. “పసుపు జెండా పవర్, పసుపు సైన్యం సత్తా కలిస్తే కోటి సభ్యత్వాలు సాధ్యం అయ్యాయి” అని ఆయన పేర్కొన్నారు. రికార్డులు సృష్టించడంలో, చరిత్ర తిరగరాయడంలో టీడీపీ కార్యకర్తలే ముందుంటారంటూ ప్రస్తావించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలు, ప్రజలు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
“విశ్వవిఖ్యాత నటరత్న ఎన్.టి.ఆర్ గారు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ముహూర్త బలం ఎంతగానో సహకరించింది. ఒక్కరితో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు కోటి మందితో అతిపెద్ద కుటుంబంగా మారింది. సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని లోకేశ్ అన్నారు.
ఏపీ, తెలంగాణ, అండమాన్ సహా అనేక ప్రాంతాల్లో నివసించే తెలుగు ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని వెల్లడించారు. “గత రికార్డులను తిరగరాస్తూ కోటి సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించాం” అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
“కార్యకర్తలే టీడీపీ బలం, బలగం. పసుపు జెండా అంటే మనకు ఒక ఎమోషన్. అధినేత చంద్రబాబు గారు పార్టీలో ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా ముందు కార్యకర్తలతో చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు” అని లోకేశ్ తెలిపారు.
“మంచి నిర్ణయాలు తీసుకుంటే పొగిడేది మీరే, తప్పు జరిగితే ప్రశ్నించేది కూడా మీరే. అందుకే పార్టీలోని ప్రతి కార్యకర్త అధినేతే. కార్యకర్తల సంతోషమే చంద్రబాబు గారి ఆనందం. ఆయన నాతో మాట్లాడిన ప్రతిసారి కార్యకర్తల ప్రస్తావన ఉంటుందని నేను గమనిస్తాను. పార్టీలో లైఫ్ టైమ్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు” అంటూ నారా లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు.