Nara lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీలో నాయకత్వంపై ఎలాంటి సందిగ్ధతకు తావులేదని స్పష్టం చేస్తూ, పార్టీకి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడేనని ప్రకటించారు. తాను సహా మిగతా అందరూ పార్టీకోసం పనిచేసే సైనికులేనని ఆయన వివరించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఇటీవల నియమితులైన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జోనల్ కోఆర్డినేటర్లతో సమావేశమైన లోకేశ్, రాబోయే ఎన్నికల్లో గెలిచి చరిత్రను తిరగరాయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలతో అనుసంధానం, ‘మై టీడీపీ’ యాప్ ఉపయోగం, ప్రజాదర్బార్లు, సోషియల్ మీడియా చురుకుదనం వంటి అంశాలను అమలు చేయాలని ఆదేశించారు. నాయకుల పనితీరు ప్రతి మూడు నెలలకు సమీక్షిస్తామని హెచ్చరిస్తూ, కూటమి పార్టీలతో సమన్వయంతో వచ్చే 15 ఏళ్ల వరకూ కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. 75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు కార్యకర్తలను కలుస్తుంటే, జగన్ మాత్రం ప్రజల నుంచి దూరంగా ఉన్నారని విమర్శించారు.
