Nallagonda Collector Tripathi: పుష్ప సినిమాలో తగ్గేదేలే.. అన్న రీతిలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయాలతో వార్తల్లోకెక్కారు. విధులు సక్రమంగా పాటించని ఉద్యోగులు, సిబ్బందిని హడలెత్తిస్తున్నారు. ఆ జిల్లాలోని గుర్రంపోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్.. విధులకు గైర్హాజరైన 8 మందిపై కఠిన చర్యలు తీసుకున్నారు. కాంట్రాక్ట్ సిబ్బందిని ఏకంగా తొలగించారు. ఇది జరిగి 48 గంటలు కాకముందే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుధీర్ఘ కాలంగా సెలవుల్లో ఉంటున్న పంచాయతీ కార్యదర్శులపై కఠిన నిర్ణయం ప్రకటించారు.
Nallagonda Collector Tripathi: వివిధ పోటీ పరీక్షల పేరుతో నల్లగొండ జిల్లాలోని 99 మంది పంచాయతీ కార్యదర్శులు నెలల తరబడి విధులకు గైర్హాజరు అవుతున్నారన్న సమాచారాన్ని కలెక్టర్ త్రిపాఠి సేకరించారు. ఆ 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. అయితే కలెక్టర్ నిర్ణయాన్ని ఉద్యోగులు, కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయిన వారిని నిబంధనల ప్రకారం సస్పెండ్ చేయాలని, కానీ, మానవతా దృక్పథంతో సర్వీస్‌ను బ్రేక్ చేశామని, తిరిగి వారందరినీ విధుల్లో తీసుకుంటున్నామని కలెక్టర్ వివరణ ఇచ్చారు.