CM Vijay: కరూర్ తొక్కిసలాట దుర్ఘటనను అడ్డుపెట్టుకుని, అప్పటి అధికార పార్టీ అయిన డీఎంకే (DMK) రాజకీయ లాభం పొందాలని చూసిందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల సమయంలో తాను కరూర్‌లో పర్యటించకుండా అప్పటి డీఎంకే ప్రభుత్వం రకరకాలుగా అడ్డుకుందని ఆయన చెప్పారు. ఈ ఏడాది మే నెలలో తమిళనాడు సీఎం కావడంతో, విజయ్ తొలిసారిగా కరూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగిన తమిళగ వెట్రి కళగం (TVK) ర్యాలీ తొక్కిసలాట ప్రమాదంలో మరణించిన 41 మంది బాధితుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం తమ పార్టీ తరఫున ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ప్రకటించిన సీఎం.. నల్ల దుస్తులు ధరించి ఈ సభకు హాజరయ్యారు. అక్కడ బాధిత కుటుంబాలకు చెందిన 32 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
ఈ సభలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. కరూర్ తొక్కిసలాట సంఘటన తనను ఎంతగానో కలిచివేసిందని, తన జీవితంలో సాధించే ఏ విజయమైనా ఈ బాధను చెరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ర్యాలీకి జనం భారీగా పోటెత్తినప్పుడు సభను ఆపేసే పూర్తి అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ, వారు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా డ్రామా చూశారని మండిపడ్డారు. తాను పోలీసులను నమ్మానని, కానీ నాడు అధికారంలో ఉన్న డీఎంకే ఒత్తిడి వల్లే పోలీసులు అలా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ప్రమాదానికి తననే బాధ్యుడిని చేస్తూ నాటి పాలకులు నిందలు వేశారని, తాను పారిపోయానని బురదజల్లారని, కానీ తాను ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని విజయ్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి కరూర్ పర్యటనలో ఒక చిన్న భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన జనాల మధ్య నుంచి ఒక వ్యక్తి అకస్మాత్తుగా బారికేడ్లను దాటుకుని సీఎం కాన్వాయ్ (వాహనాల శ్రేణి) వైపు దూసుకొచ్చాడు. అయితే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ వ్యక్తి సీఎం కారును తాకకముందే చాకచక్యంగా పట్టుకుని పక్కకు లాగేశారు. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం కాన్వాయ్ ముందుకు సాగింది. విజయ్ పర్యటన కోసం కరూర్‌లో భారీగా పోలీసులను మోహరించి, సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత ఎంట్రీ పాస్‌లను కూడా జారీ చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి విజయ్ కరూర్ పర్యటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ పర్యటన పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనని, ప్రస్తుతం ఈ తొక్కిసలాట ఘటనపై జరుగుతున్న సీబీఐ (CBI) దర్యాప్తును ప్రభావితం చేయడానికే సీఎం ఇక్కడికి వచ్చారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
